ఆధ్యాత్మిక సమస్యకు... అసలైన పరిష్కారమేంటి?

Update: 2019-01-21 05:11 GMT

అయ్యప్ప దర్శనానికి రుతుక్రమంలో ఉన్న ఆడవారు అనర్హులని ఓ పక్క భక్తులు మండిపడుతుంటే.. ఆరునూరైనా మేం వెనక్కి తగ్గేది లేదంటున్నారు మహిళా భక్తులు.. అనడమే కాదు.. తమకు తోచిన రీతుల్లో, రహస్య మార్గాల్లో స్వామిని దర్శించుకుంటూనే ఉన్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శన దుమారం ఇంకా కొనసాగుతోంది. ఓవైపు భక్త గణం ఆంక్షలతో హడలెత్తిస్తున్నా.. మహిళలు మాత్రం చాటుమాటుగా, పోలీస్ అండదండలతో దర్శనం చేసేసుకుంటున్నారు. మకర జ్యోతి దర్శనం సజావుగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా. ఇప్పటివరకూ ఏకంగా 51 మంది మహిళలు ఇప్పటి వరకూ స్వామిదర్శనం చేసుకున్నారని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది.. సుప్రీం కోర్టుకు సమర్పించిన జాబితాలో వివిధ వయసులకు చెందిన 51 మంది మహిళలు స్వామిని దర్శించుకున్నారంటూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియ చేసింది.

జనవరి 2న అయ్యప్పను దర్శించుకున్న కనక దుర్గ, బిందు అమ్మిణి లకు తలెత్తిన భద్రతా పరమైన సమస్యల పై సుప్రీం సమీక్షిస్తున్న సందర్భంలో కేరళ సర్కార్ ఈ లిస్ట్ అందచేసింది. అయ్యప్పను దర్శించుకున్న మహిళలపై ఇతరుల నుంచి భౌతిక దాడులు ఎదురవుతున్నాయి. ఆరెస్సెస్, అయ్యప్ప భక్త జన సంఘం స్వామి దర్శనం చేసుకున్న మహిళల అంతు చూస్తామని ఇప్పటికే ప్రకటించడంతో వారికి ఇంటి దగ్గర భద్రతా సమస్యలు తలెత్తాయి.. ఈ నేపధ్యంలో వారు ఇంటికి వెళ్లకుండా అక్కడా, అక్కడా కాలక్షేపం చేస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన తనపై తన అత్త దాడి చేసి కొట్టిందంటూ దుర్గ అనే మహిళ కోర్టులో కేసు వేసింది. ఇప్పటికీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

మహిళలు స్వామిని దర్శించుకోడాన్ని తప్పు బడుతున్న ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేసి తిరిగి పూజలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఇది అన్యాయమంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ పై అడ్వకేట్ ఇందిరా జైసింగ్ కూడా స్పందించారు. మహిళల ఆలయ ప్రవేశం అనేది హిందూ మనోభావాలకు సంబంధించిన అంశమని, దీనిని గౌరవించి తీరాలని గతంలో ఆమె వాదించారు. కానీ ఇప్పుడు ఆలయాన్ని శుద్ధి చేయడం తప్పని ఆమె వాదించారు. అయితే ఇతర అంశాలతో తమకు సంబంధం లేదని కోర్టు చేతులు దులిపేసుకుంది. స్వామి దర్శనానికి రుతుక్రమం వయసులో ఉన్న 7,564 మంది మహిళలు డిజిటల్ పద్ధతి ద్వారా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. దైవ దర్శనానికి మారు వేషాల్లో, తలలకు రంగు వేసుకుని వెళ్లి దర్శించుకున్న మహిళలు ఇప్పుడు భద్రతా పరమైన సమస్యతో భయపడుతున్నారు. వారు ఇంటికి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. తమకు నిరంతరం రక్షణ కావాలంటూ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.

ఇక స్వామి దర్శనానికి వెళ్లిన మహిళలకు విఐపీ ట్రీట్ మెంట్ ఇస్తూ కేరళ పోలీసులు అతి చేస్తున్నారని హై కోర్ట్ అపాయింట్ చేసి పానెల్ విమర్శించింది. వారి హక్కును కాపాడమని కోర్టు చెబితే.. వారికి వీఐపీల్లా రాచమర్యాదలు చేస్తూ కొత్త సమస్యలు తేవడం కాదని వారించింది. ఇలా శబరిమల వివాదం రోజుకో కొత్త అంశంతో వార్తల్లో నానుతోంది.

Similar News