పాక్‌ ఎలాంటి దాడులకు పాల్పడుతుందోనన్న భయం

Update: 2019-02-28 12:05 GMT

కాశ్మీర్‌ లోయలో యుద్ధ వదంతులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వందల కంపెనీల పారా మిలటరీ దళాలు ఇక్కడకు చేరడంతో... భారత ప్రభుత్వం యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా యుద్ధ మేఘాలు కమ్ముకోవచ్చన్న ఆలోచనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఏ క్షణమైన యుద్దం రావచ్చన భయంతో సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతుంటే అదే సమయంలో ఫలానాచోట బాంబు పేలింది అంటూ కొందరు లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో బియ్యం, గోధుమలు, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు, పప్పులు, పాలపొడి తదితర నిత్యావసర సరకులను లోయవాసులు పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అవసరమైన మందులు, పెట్రోలును కూడా సమకూర్చుకుంటున్నారు. దీంతో దుకాణాలు, పెట్రోలు బంకులు కిటకిటలాడుతున్నాయి.

చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడే పరిస్థితులు కనిపిస్తున్నాయిక్కడ. నియంత్రణ రేఖకు సమీపంలోని సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడుతుందో తెలియని పరిస్థితుల్లో.. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలన్నింటికి సెలవులు ప్రకటించారు. ఇంటర్నేషనల్ బోర్డర్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లన్నింటినీ మూసే ఉంచారు.

ఇక సరిహద్దు గ్రామాల్లో సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఏడు వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంచారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించిన తర్వాత సరిహద్దులో సైన్యం ఈ ఆంక్షలు విధించింది. ప్రతీకార దాడికి పాక్ సిద్ధమవుతోందన్న వార్తలతో అప్రమత్తమైన భారత్ సైన్యం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సరిహద్దు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించకపోయినప్పటికీ పౌరుల రాకపోకలపై నిషేధం విధించింది. సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు రాత్రిపూట సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఏప్రిల్ మొదటి వారం వరకు రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాకపోకలపై నిషేధం విధించినట్టు సైన్యం తెలిపింది. అలాగే, సరిహద్దులో రానున్న మూడు రోజులపాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది. 

Similar News