తెలంగాణలో వరుసగా ఎన్నికల హడావిడి!

Update: 2019-03-11 11:45 GMT

తెలంగాణ వరుసగా ఎన్నికలు రానున్నాయి. డిసెంబర్ మొదలైన ఎన్నికల ప్రక్రియ జులై వరకు కొనసాగనున్నాయి. మున్సిపల్ , ప్రాదేశిక , సహకార ఎన్నికలు వరుసగా రానున్నాయి. జులై వరకు దాదాపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండబోతోంది. కొత్త పథకాలు,కార్యక్రమాలకు ప్రకటనకు కోడ్ అవరోధం అవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఒకదాని వెంట ఒకటి ఎన్నికలు వచ్చి పడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో మొదలైన ఎన్నికల హడావిడి జులై వరకు కొనసాగుతాయి. స్వల్ప విరామంతో ఎన్నికల కోడ్ అమలవుతోంది. కోడ్ ఉన్నప్పుడు కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించకూడదనేది నియమం. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఆదివారం వెలువడటంతో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని లెక్కిస్తే జులై నాటికి మొత్తం 8 నెలల్లో 8 రకాల ఎన్నికలు అవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు. పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. కొత్తగా ఏర్పాటైన , పాలకవర్గాల వ్యవధి ముగిసిన పురపాలక సంఘాల ఎన్నికలకు మార్గం సుగమం అయింది.

మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. గ్రామాల్లో పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికల్లో గెలుపొందిన వారి నుంచే మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నికవుతారు. ప్రాదేశిక ఎన్నికలను మే నెలలో చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. లోక్‌సభ ఫలితాలు మే 23న వెలువడనుండటంతో మున్సిపల్ , ప్రాదేశిక ఎన్నికలను జూన్ , జులై నెలల్లో నిర్వహించే అవకాశాలున్నాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన పదిరోజుల్లోగా మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఇవి పూర్తయ్యాక సహకార ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. వీటిని ఇప్పటికే పూర్తి చేసేందుకు జనవరిలో కొన్ని ఏర్పాట్లు చేశారు. తగిన వ్యవధి లేదన్నకారణంతో ఎన్నికలను వాయిదా వేశారు. వరుస ఎన్నికలతో రాజకీయ నేతలు , కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. 

Similar News