మగోన్మాదుల దాడులు... అమ్మాయిల జీవితాలతో ఆటలు!!

Update: 2019-02-11 05:04 GMT

తెలుగు రాష్ట్రాలలో ప్రేమోన్మాదుల ఆగడాలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. ప్రేమ పేరుతో ఆడపిల్లలపై మగపిల్లలు చేస్తున్న దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.. ఆడపిల్లల తల్లి దండ్రులు భయంతో.. గడపాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆడపిల్ల బయటకెడితే భద్రంగా ఇంటికి తిరిగొచ్చే వరకూ గ్యారంటీ లేదు. స్త్రీ స్వేచ్ఛ దిశగా ఆధునిక సమాజాలు కదులుతున్నాయనుకుంటున్న తరుణంలోనే ఇలాంటి పాశవిక దాడులూ ఎక్కువవుతున్నాయి.. ప్రేమోన్మాదులు తెగబడుతున్నారు.. కాదు.. కాదు మగోన్మాదులు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. తాము కోరుకున్న అమ్మాయిలపై వలేసి.. వెంబడించి, వెంటాడి వేటాడుతున్నారు.. చదువు సంధ్యా గాలికొదిలి..రికామీగా తిరిగే పోకిరీలు అమ్మాయిల జీవితాలతో ఆటాడుకుంటున్నారు.. ప్రేమ పేరుతో దాడులకు తెగబడుతున్నారు.. ఈ వన్ సైడ్ లవ్ ట్రాక్ తో అమ్మాయిలు భయపడుతున్నారు..

ప్రేమ.. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారిన అంశం.. ప్రేమ వలయంలో చిక్కుకుంటే ప్రాణాలే పోతాయి.. మగ పిల్లల ఏక పక్ష ప్రేమలకు ఆడపిల్లలు బలైపోతున్న దురదృష్టకర సందర్భం ఇది..ఒకటి కాదు.. రెండు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఈ తరహా దాడులు ఎక్కువైపోతున్నాయి. ప్రేమిస్తే ఒక కష్టం.. ప్రేమించకపోతే మరో కష్టం.. అయితే హత్యలు. లేదా ఆత్మహత్యల దిశగా ప్రేరేపించే సంఘటనలు.. యువతలో పెరుగుతున్న ఈ ప్రమాదకర పోకడలు చివరకు ఎక్కడికి దారి తీస్తాయో అన్న టెన్షన్ సమాజంలో అందరికీ కలుగుతోంది. భాగ్య నగరంలో కొద్ది రోజుల క్రితం ఓ ప్రేమోన్మాది వేట కొడవలితో ఓ బాలికపై దారుణంగా దాడి చేశాడు.. ప్రమాదకర స్థితిలో బాలిక ఆస్పత్రిలో ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. మూడేళ్లుగా బాలిక వెంట ప్రేమ పేరుతో వేధిస్తున్న భరత్ ఆమె తిరస్కారంతో మరింత రెచ్చిపోయాడు.. కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో బాధితురాలిపై దారుణంగా దాడి చేశాడు. ఈ ఉన్మాది చేష్టకు బాలిక తలపై తీవ్రమైన గాయంతో, చేతివేళ్లు తెగి, చేతులకు గాయాలై చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రేమ నిరాకరించిందన్న కసితో ఆమె ప్రాణాన్నే తీసేయడానికి ఒడిగట్టాడా నిందితుడు.. మూడేళ్ల నుంచి ఆ బాలిక వెంటపడుతున్న ఈ నేరగాడిని గతంలో అతని బాబాయే మందలించాడు.. కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడు.. అయినా ఫలితం శూన్యం.. అదే ప్రవర్తనతో మరింత రెచ్చిపోయాడు.. భరత్ ప్రమాదకర పోకడలను కనీసం ఇంట్లో వారైనా గమనించకపోవడం దారుణం.. ఇది సమాజం పట్ల బాధ్యతారాహిత్యమే అవుతుంది.. ఎదిగిన పిల్లల ప్రవర్తన, పోకడలను పసికట్టలేని తల్లి దండ్రులకీ ఈ నేరంలో భాగస్వామ్యం ఉందని చెప్పక తప్పదు. వారి బాధ్యతా రాహిత్యం సమాజంపై పడుతోంది..మూర్ఖపు ప్రేమలకు.. ఆడపిల్లలు బలై పోతున్నారు..

ఇలాంటిదే మరో ఘటన టీవీ నటి ఆర్టిస్టు ఝాన్సీ ఆత్మహత్య.. ఇది ప్రేమలో మరో కోణం.. తనను ప్రేమించానని నమ్మించి, చివరకు పెళ్లాడబోనని ప్రియుడు సూర్య తేల్చేయడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. సూర్య కోసం ఆ వర్ధమాన నటి తన కెరీర్ నే ఫణంగా పెట్టింది.. ప్రేమ పేరుతో దగ్గరైన అతగాడు.. ఆ తర్వాత పెళ్లికి మొఖం చాటేయడంతో ఆమె ఆత్మ హత్య చేసుకున్నట్లు వార్తలున్నాయి.. ఇది యువతలో పెరుగుతున్న నిరాశా, నిస్పృహలకు మరో ఉదాహరణ.. ప్రేమ ఫలించకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం వారిలో బలహీనతను తెలియచేస్తోంది. జీవితం పట్ల అవగాహన లేకపోవడం.. ప్రేమ విఫలమైతే జీవితమే వృధా అన్నట్లు నిరాశ చెందడం పరిణతి లేని వ్యక్తిత్వానికి నిదర్శనం.. ప్రేమ విఫలమైతే జీవితమే అంతం చేసేసుకోవాలన్న నిర్ణయానికి రావడం నేటితరం దూకుడుతనానికి నిదర్శనం.. విపరీతమైన ఒత్తిడి, అసహనం.. ఆందోళన.. గత కొంతకాలంగా సామాజిక పరంగా, టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, పోకడలు ఈ నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఇవి బయటపడిన కొన్ని సంఘటనలు మాత్రమే.. బయటకు వెల్లడి కాని ఉదంతాలూ చాలానే ఉన్నాయి..

Similar News