కంచుకోటలో మరోసారి కమలం వికసిస్తుందా?

Update: 2019-04-18 15:50 GMT

నిత్యం నమో స్మరణలు వినిపించే గుజరాత్‌లో ఎన్నికలు వాతావరణం వేడెక్కాయి. గత ఎన్నికల వైభవం పునరావృతం చేయాలనే తపనతో గల్లీ నుంచి ఢిల్లీ నేత వరకూ ప్రచారం చేస్తున్నారు. సబర్మతీ తీరంలో కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి కమలం జెండా రెపరెపల కోసం కమలనాథులు కృషి చేస్తున్నారు. సబర్మతీ నదీ తీరంలో ఉన్న ప్రధాన లోక్‌సభ నియోజకవర్గాల్లో కమల వికాసమే కనిపిస్తోంది. కమలానికి కంచుకోటగా ఉన్న గాంధీనగర్‌ నుంచి అమిత్‌షా బరిలోకి దిగడంతో అందరి చూపు అటువైపే ఉంది.

నిజానికి గాంధీనగర్‌ను, ఆద్వానీని వేర్వేరుగా చూడలేరు అక్కడి ప్రజలు. 1989లో తొలిసారి గాంధీనగర్‌ను సొంతం చేసుకుంది బీజేపీ. 1991 నుంచి అద్వానీ డబుల్‌ హాట్రిక్‌ సాధించారు. చివరి వరకూ స్థానికులంతా ఆద్వానీనే బరిలో దిగుతారని ఆశించినా.. అనూహ్యంగా అమిత్‌షా తెరపైకి వచ్చారు. 1991లో ఆద్వానీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అమిత్‌షా అదే స్థానం నుంచి బరిలో దిగడం విశేషం.

ప్రధానిగా పీఠమెక్కి గుజరాత్‌ గడప దాటిన మోడీ ప్రభావం రాష్ట్రంలో మసకబారుతోందని విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో బలమైన నేతను బరిలోకి దింపడం అవసరమని పార్టీ వర్గాలు భావించాయి. అందుకే ఇప్పటివరకూ లోక్‌సభ బరిలోకి దిగని అమిత్‌షాను రంగంలో నిలపాలనుకున్నారు. ఆద్వానీకి కంచుకోటగా ఉన్న గాంధీనగర్‌ అమిత్‌షాకు సరి అని భావించిన బీజేపీ... అమిత్‌షాకు అసమ్మతి వర్గం లేకుండా జాగ్రత్తలు తీసుకొంది. దీంతో అమిత్‌షా విజయం నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు విశ్లేషకులు.

గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో గాంధీనగర్‌ ఉత్తర, కలోల్‌ స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. గాంధీనగర్‌ ఉత్తర ఎమ్మెల్యే సీజే చావ్లానే ప్రస్తుతం గాంధీనగర్‌ లోక్‌సభ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందిన రెండు స్థానాల్లో ముస్లిం, దళిత, క్షత్రియ, ఓబీసీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ముస్లిం, దళితులు కాంగ్రెస్‌ వైపు ఉండగా మిగిలిన వర్గాల్లో అత్యధికులు బీజేపీకి అనుకూలం. కాంగ్రెస్‌ అభ్యర్థికి గాంధీనగర్‌ నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, పక్కాగా ప్రచారం చేసే నాయకులు, కార్యకర్తలు లేకపోవడం ప్రతికూలాంశాలు. ఇక్కడ పాటీదార్ల ప్రాబల్యమూ ఉంది. ఇక్కడ అభ్యర్థులతో సంబంధం లేకుండా మోడీ స్మరణతోనే జనాల్లోకి వెళ్లి ఓట్లు కొల్లగొట్టాలన్నది కమలం ఆలోచన. 

Similar News