ఈడబ్ల్యూఎస్‌ పథకం... చట్టంలో మార్పులు ఆచరణ సాధ్యమేనా?

Update: 2019-01-29 05:02 GMT

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని రాష్ట్రస్థాయిలో అమలు చేసే విషయంలో పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తాయన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ విషయానికి వస్తే........ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. కేంద్ర చట్టం తరహాలో రాష్ట్రంలో కూడా ఆ చట్టం తీసుకువస్తే ముస్లింలకు ఆ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించే వీలు ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లలోనే కాపులకు 5 శాతం రిజర్వేషన్లను సర్దుబాటు చేయాలన్న యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాపు వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. తమను బీసీల్లో చేర్చాలని కాపు వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక తమిళనాడులో మొత్తం జనాభాలో బీసీల జనాభానే అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. గుజరాత్ ప్రభుత్వం మరో వాదన లేవనెత్తింది. 1978 తరువాత రాష్ట్రంలో స్థిరపడిన వారికి EWS రిజర్వేషన్లు వర్తించవని ప్రకటించింది. ఇక ఆదాయ పరిమితి విష‍యంలో కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలు గా స్పందించే అవకాశం ఉంది. వీటన్నిటిని చూస్తుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇతర రిజర్వేషన్ల తరహాలోనే EWS రిజర్వేషన్లను సైతం ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు సాధించుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అగ్రవర్ణాల పేదకు 10 శాతం రిజర్వేషన్ల అంశం పాలనాపరంగా, చట్టపరంగా మరెన్నో వివాదాలను రేకెత్తించేలా ఉంది. EWS రిజర్వేషన్లు అగ్రకులాల వారికి మాత్రమే పరిమితమా? పేదలందరికీ వర్తిస్తాయా ? కులం సర్టిఫికెట్లను పెట్టకపోవడం ద్వారా తాము సైతం ఈ రిజర్వేషన్లను పొందగలమని కొంత మంది బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. ఆ విధంగా చేయడం సాధ్యపడుతుందా? అలా విద్యా, ఉద్యోగావకాశాలను పొందిన వారు తిరిగి మరో సందర్భంలో ఇతర సంక్షేమ పథకాలకు బీసీ సర్టిఫికెట్లను వినియోగించుకోవచ్చా ? విద్యా, ఉద్యోగవకాశాల్లో పేదరికాన్ని గుర్తించేందుకు 8 లక్షల రూపాయల పరిమితి పెట్టినప్పుడు, ఇతర సంక్షేమ పథకాలకు సైతం అలా ఎందుకు చేయకూడదు? ప్రైవేటు విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యమా? 10 శాతం రిజర్వేషన్ల విభాగంలో కటాఫ్ మార్కులు లాంటి పరిమితులు జనరల్ కోటా కటాఫ్ ను మించి పెరిగిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ల ద్వారా ఆశించిన ఫలితాలను పొందగలమా? ఇలాంటివే మరెన్నో సందేహాలు సాధారణ ప్రజానీకంలో ఉన్నాయి. అలాంటివాటికి సమాధానాలు లభించాల్సి ఉంది. 

Similar News