2019లో మహా భారత సంగ్రామం.. విజయమో వీరస్వర్గమో

Update: 2019-01-02 04:48 GMT

మంచో, చెడో విజయమో, వీరస్వర్గమో 2018 ఒక ఆటాడుకుని, టాటా చెప్పేసి వెళ్లిపోయింది. అసలైన గేమ్ ఇప్పుడే మొదలైంది. 2019 మహా భారత సంగ్రామానికి వేదిక కాబోతోంది. అస్త్రశస్త్రాల రణక్షేత్రమవుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలు దేశ తలరాతను కాదు, ఉద్దండ రాజకీయ నాయకుల భవిష్యత్తును డిసైడ్ చేయబోతుంటే, ఆంధ్రప్రదేశ్‌తోనూ జరిగే అసెంబ్లీ పోరు, చంద్రబాబు, జగన్, పవన్‌ల ఫ్యూచర్‌ను నిర్దేశించబోతోంది. మరి మహాసంగ్రామంలో ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి...ఎన్నికల సమరానికి ఎలా సిద్దమవుతున్నాయి. ఒకవైపు మోడీ కొత్త సంవత్సరం రోజే, మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి, ఎన్నికల శంఖారావం పూరించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయఢంకా మోగించిన రాహుల్‌, దేశమంతా అదే సమరవ్యూహం అమలు చేస్తామంటూ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలతో మూడో కన్ను తెరుస్తానంటున్నారు. అంటు ఆంధ్రప్రదేశ్‌లో త్రిముఖ సమరం, రసవత్తరంగా మారింది. 2019 ప్రవేశిస్తూనే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నికల హీట్‌ పెంచేసింది.

అవును. అనేక కాల పరీక్షలు పెట్టి, 2018, చరిత్రలో కలిసిపోయింది. చరిత్ర సృష్టించేదెవరు....చరిత్రలో కలిసిపోయేదెవరంటూ...2019 సవాల్‌ విసురుతోంది. భారతదేశ రాజకీయాల్లో అసలుసిసలు రాజకీయ సమరాంగణానికి వేదికవుతోంది 2019 సంవత్సరం. దేశమంతా గుజరాత్‌ మోడల్‌ చూపి, అందరిలోనూ ఆశలురేకెత్తించి, 2014లో విజయఢంకా మోగించిన నరేంద్ర మోడీకి, అలాంటిలాంటి పరీక్ష పెట్టడం లేదు 2019. అటూ ఇటూ అయితే, తిరిగి గుజరాత్‌కే పయనం కాకతప్పదన్న టెన్షన్‌ మోడీకి పట్టుకునేలా చేస్తోంది. ఆల్‌ వర్సెస్ మోడీగా సాగే, పార్లమెంట్‌ పోరులో ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని హైరాన పడుతున్నారు మోడీ. మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించి, జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకీ, 2019 రియల్‌ పరీక్ష పెట్టబోతోంది. యువ నాయకుడిపట్ల దేశ ప్రజల ఆలోచన ఏంటో చెప్పబోతోంది 2019. ఇక ఆంధ‌్రప్రదేశ్‌లో పోరు మామూలుగా లేదు. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు సాగే, ఏపీ శాసన సభ సమరం, చంద్రబాబుకు లిట్మస్‌ టెస్ట్ కాబోతోంది. అలాగే వైసీపీ అధినేత జగన్‌కు జీవన్మరణం. మరోవైపు ఫస్ట్‌ టైమ్‌ నేరుగా ఎన్నికల్లో తలపడుతున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, పొలిటికల్‌ ఎగ్జామ్‌కు సిద్దమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి, జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌‌, పార్లమెంట్‌ ఎలక్షన్స్‌పై గురిపెట్టారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తో, దేశానికి సరికొత్త రాజకీయం పరిచయం చేస్తానని, ఢంకాబజాయిస్తున్నారు. కేసీఆర్‌‌తో వచ్చేదెవరు....చివరి వరకూ ఉండేదెవరో, తేల్చబోతోంది 2019. మరో రెండు నెలల్లో మోగబోతున్న సార్వత్రిక నగారాలో, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషా, అస్సాం, అరుణాచల్, సిక్కింలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో 2019 ఎన్నికలు, అన్ని రాజకీయ పార్టీలకూ అత్యంత కీలకం. మరింత స్పష్టంగా చెప్పాలంటే చావోరేవో. ఉద్దండ రాజకీయ నాయకులకూ ఆఖరి యుద్ధంలా మారిపోయాయి. మరి 2019 ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఎలా సిద్దమవుతున్నాయి....ఎలాంటి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి...

Similar News