క్షీణించిన వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం

Update: 2018-04-09 09:50 GMT

ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు డీహైడ్రేషన్ కు గురయ్యారంటూ తెలిపారు. తక్షణమే దీక్ష విరమించి వైద్యానికి సహరించాలంటూ కోరారు. ఇందుకు ఆయన అంగీకరించకపోవడంతో దీక్ష స్థలిని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు  బలవంతంగా వైవి సుబ్బారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. 

ఈనెల ఆరవ తేదిన పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన వెంటనే రాజీనామాలు సమర్పించిన ఐదుగురు ఎంపీలు ఏపీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే మరుసటి రోజే మేకపాటి రాజమోహన్ తీవ్ర అస్వస్ధతకు గురి కావడంతో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. శనివారం మరో ఎంపీ వర ప్రసాద్  ఆరోగ్యం కూడా క్షీణించడంతో బలవంతంగానే ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు వైవీ సుబ్బారెడ్డిని కూడా ఆసుపత్రికి తరలించడంతో  రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రమే దీక్ష కొనసాగిస్తున్నారు. 

ఇక టీడీపీ ఎంపీలు సైతం హోదా ఉద్యమాన్ని ఉదృతం చేశారు. నిన్న ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించిన ఎంపీలు ఈ రోజు రాజ్ ఘాట్ లో మౌన దీక్షకు దిగారు. తెలుపు దుస్తుల్లో, గాంధీ టోపి ధరించి నిరసన ప్రదర్శనకు కూర్చున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ మహాత్ముడి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. 

Similar News