నాడు వాజ్‌పేయి, నేడు యడ్యూరప్ప.. అప్పుడు.. ఇప్పుడు ఏం జరిగింది?

Update: 2018-05-20 12:38 GMT

కన్నీళ్లు పెట్టుకుని, యడ్యూరప్ప విధానసౌధలో వీడ్కోలు ప్రసంగం చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరించామని, కాంగ్రెస్, జేడీఎస్‌లను ప్రజలు తిరస్కరించారని ఉద్వేగంగా మాట్లాడారు. ఇదే తరహా ఘటన, 1996లో లోక్‌సభలో ఆవిష్కృతమైంది. నాడు వాజ్‌పేయి కూడా నెంబర్‌ గేమ్‌లో వెనకబడి, నైతిక కారణాలతో రాజీనామా చేస్తున్నానని, హుందాగా తప్పుకున్నారు. ఇంతకీ నాడు వాజ్‌పేయి హయాంలో ఏం జరిగింది?

1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్‌ అందుకోలేకపోయింది. అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. సభలో బలంలేదని తెలిసినా కూడా అటల్‌ బిహారి వాజ్‌‌పేయి, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అది రెండువారాల ముచ్చటగానే మిగిలిపోయింది. బలపరీక్షలో నెగ్గలేక 13 రోజులకే పతనమైంది వాజ్‌పేయి సర్కారు. మెజార్టీ లేకపోయినా, ప్రతిపక్ష ఎంపీల మద్దతు పొందవచ్చన్న ధైర్యంతో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాజ్‌పేయి. కానీ ఒక్కరూ కూడా అదనంగా జతకట్టలేదు. వాజ్‌పేయి చాలా హుందాగా, రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రిజైన్ చేసేముందు, లోక్‌సభలో దాదాపు గంటసేపు ప్రసంగించారు. నైతిక కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు ముందు పరస్పరం ఆరోపణలు చేసుకుని, విభేదించిన పార్టీతోనే కాంగ్రెస్‌ జతకడుతోందని, బీజేపీకి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పును కాలరాసిందని ఆగ్రహించారు. లోక్‌సభలో నాడు వాజ్‌పేయి చేసిన ప్రసంగం, చారిత్రాత్మక స్పీచ్‌గా నిలిచిపోయింది.

వాజ్‌పేయి అద్భుతమైన ప్రసంగం, హుందాగా రాజీనామా చేయడం, దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆ‍యన పట్ల సానుభూతి పవనాలు వీచేలా చేశాయి. 1999 ఎన్నికల్లో విజయం సాధించడానికి, దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతారు. వాజ్‌పేయి రాజీనామాతో, కేవలం 44 సీట్లు ఉన్నప్పటికీ జనతాదళ్‌కు చెందిన దేవెగౌడ యునైటెడ్‌ ఫ్రంట్‌ తరఫున ప్రధాని సింహాసనం అధీష్టించారు. 136 సీట్లు ఉన్న కాంగ్రెస్‌, దేవేగౌడకు జైకొట్టింది. అయితే, ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీయే మద్దతు ఉపసంహరించి, దేవేగౌడను దింపేసింది.

Similar News