ఓటు గల్లంతయితే రాజకీయం గాడి తప్పదా?

Update: 2018-10-27 12:45 GMT

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ఉండే అభ్యర్థులను ఎన్నికోవాలంటే సామాన్యుడి చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. పోలింగ్‌ సమయంలో ఓటరు విచక్షణతో వేసే ఓటుకు నేతల తలరాతలను తల్లకిందులుగా చేసే శక్తి ఉంటుంది. ఎన్నికల సంఘం కూడా ఇటీవలే ఓటరు తుది జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2014 ఎన్నికల సమయంలో ఉన్న జాబితాలోని ఓట్లు కొన్ని గల్లంతు కాగా.. మరికొందరు ఓటర్ల ఫొటోలు తప్పుగా ప్రచురితమైనట్లు ప్రాథమికంగా క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిది. ఆన్‌లైన్‌లో జాబితా చూసుకోగలిగే వారి విషయంలోనే ప్రస్తుతానికి తప్పులు దొరుకుతున్నాయి.. కాని గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. జిల్లాలోని అనేకమంది పదేళ్లుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నా జాబితాలో ఓటు గల్లంతవడం అయోమయాన్ని కలిగిస్తోంది. కుటుంబంలోని మిగిలిన సభ్యుల పేర్లు ఉన్నా... ఇంటి యజమాని ఓటు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  

అధికారులు తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం... తాజా ఓటరు గణాంకాల ప్రకారం ఖమ్మం జిల్లాలో 10లక్షల 54వేల 838 ఓటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8లక్షల 47వేల 528 ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల సమయానికి, ప్రస్తుతానికి కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. దీనికి అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం పట్టణాలకు వచ్చే వారు తరచూ ఇళ్లు మారడం సహజం. వీరు ఇళ్లు మారినపుడు చిరునామా మార్పునకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ దరఖాస్తు చేసుకోవడం లేదు. వెరిఫికేషన్ సమయంలో పాత చిరునామాకు వెళ్తే లేరన్న సమాధానం వస్తుంది. దీంతో ఓటు తొలగిస్తున్నారు. ఓటరు తన బాధ్యతగా చిరునామా  మార్పులు చేసుకుంటూ దరఖాస్తు చేసుకుంటే సమస్య తొలిగే అవకాశం ఉంది. మరికొందరు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఓటరు జాబితాలో పేర్లు ఉండటంలేదు. దీనికి కొందరు కిందిస్థాయి సిబ్బందే కారణమనే ఆరోపణలున్నాయి. మరోవైపు  బీఎల్‌వోలుగా ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందికి బాధ్యతలు  అప్పగిస్తున్నారు. వీరు వారి శాఖ పనులతోపాటు అదనంగా బీఎల్‌వో విధులు నిర్వహించాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోంది.  రాజకీయ ఒత్తిళ్లతో కూడా కొన్నిచోట్ల ఓట్లు తొలగించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 

తుది ఓటరు జాబితా ప్రదర్శన ఇప్పటి వరకు పరిమిత సమయమే కేటాయించడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. బీఎల్‌వోలు చురుగ్గా ఉన్న చోట బూత్‌ స్థాయిలో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని  మెజారిటీ ప్రాంతాల్లో  తుది ఓటరు జాబితా ప్రజానీకానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అశ్వారావుపేట, వైరా తదితర నియోజకవర్గాల్లో ఓటరు జాబితాలు గ్రామీణ ప్రాంతాలకు చేరాల్సి ఉంది. ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ భాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండటంతో పోలింగు రోజునే  ఓటు ఉన్నదీ లేనిదీ చూసుకునే అలవాటు ఉన్న గ్రామీణ ఓటర్లకు  క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా.. జాబితా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
 

Similar News