ఉత్తమ్‌పై కత్తి దూసే బాహుబలి ఎవరు?

Update: 2018-09-14 07:48 GMT

వెన్నుచూపని వీరులను ఎన్నుకుని మరీ పంపమను అంటున్న పీసీసీ చీఫ్‌పై, గులాబీదండు ఎవరిని బరిలోకి దింపాలనుకుంటోంది...105 మంది అభ్యర్థులను ప్రకటించినా, హుజూర్‌ నగర్‌ సామ్రాజ్యంపై ఎందుకు దండెత్తడం లేదు...టఫ్‌ పోటీనిచ్చే గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తుందా....లేదంటే ఉన్నవారిలోనే అసమ్మతి సెగలతో వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్‌ సీఎం రేసులో వినిపిస్తున్న పేరు. హుజూర్‌ నగర్‌ నుంచి రెండు సార్లు గెలిచారు ఉత్తమ్. దీంతో అందరి దృష్టి హుజూర్‌ నగర్‌పై పడింది. ఉత్తమ్‌కు చెక్‌ పెట్టి, మొత్తం కాంగ్రెస్‌ అధిష్టానానికే గట్టి వార్నింగ్‌ ఇవ్వాలని, ఎన్నో వ్యూహాలు వేస్తున్న కేసీఆర్, ఈ స్థానానికి మాత్రం ఇప్పటి వరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. 

2014 ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి ,టిఆర్ఎస్ అభ్యర్ధిగా తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బరిలో నిలిచారు. ఉత్తమ్ విజయం సాధించారు. అప్పటి నుంచి టీఆర్ఎస్్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా శంకరమ్మ కొనసాగుతున్నారు. అయితే, పలుమార్లు శంకరమ్మ నియోజకవర్గంలో క్యాడర్‌ను ఫోన్లలో విమర్శించడంతో పాటు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో సఖ్యతలేకపోవడం, ఇక తన కొడుకు శ్రీకాంతాచారి అమరత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదని బహిరంగంగానే విమర్శించడం, చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అంతేకాదు నియోజకవర్గంలోను క్యాడర్‌తో కలిసిపోకపోవడం కూడా ప్రస్తుతం శంకరమ్మకు టికెట్ ప్రకటించకపోవడానికి కారణమన్న చర్చ జరుగుతోంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం ఓడించాలని పట్టుదలగా ఉన్న టీఆర్ఎస్, గట్టి అభ్యర్థి అన్వేషణలో ఉన్నందుకే అభ్యర్ధిని ప్రకటించలేదన్న సమచారం ఉంది.

ఉత్తమ్‌పై పోటీకి, ప్రస్తుత నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటిచేయాలని టిఆర్ఎస్ అధిష్టానం కోరినట్లు సమాచారం. అయితే దీనికి గుత్తా నో అనడంతో, .ప్రస్తుతానికి హుజుర్ నగర్ ఇంకా వేకెంట్ లిస్ట్ లోనే ఉంది. గుత్తా సుఖేందర్‌ నో అనడంతో, ఉత్తమ్‌పై పోటీకి సై అంటున్నారు ఎన్‌ఆర్‌ఐ శానంపూడి సైదిరెడ్డి. హుజుర్ నగర్ ప్రాంతానికే చెందిన సైదిరెడ్డి, కెనడాలో హోటల్ బిజినెస్‌ చేశారు. నియోజకవర్గంలో పనిచేసుకోవాల్సిందిగా సైదిరెడ్జికి, కొంతకాలం కిందటే కేసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు సైదిరెడ్డి. ముఖ్యంగా యువతను తనవైపు ఆకర్షించేందుకు యువ సమ్మేళనాలు ఆర్గనైజ్‌ చేస్తున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి ద్వారా కేటీఆర్‌తో, రాయబారం నడిపినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి శంకరమ్మను అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, ఆమె ప్రయత్నాలు మాత్రం అపడంలేదు. మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డిలతో విస్తృతంగా చర్చలు జరుపుతుండగా ...సైదిరెడ్డి సైతం, ఎన్నికలో తాను ఎంతఖర్చుకైనా వెరవనని, ఉత్తమ్‌పై తాను స్ధానికంగా పైచేయి సాధిస్తానని, అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయాలని కోరుతున్నారు. అయితే శంకరమ్మ తో పాటు సైదిరెడ్డి అభ్యర్ధిత్వాలను పరిశీలిస్తూనే ...మరో బాహుబలి కోసం టిఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఒకానొక దశలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సైతం హుజుర్ నగర్ నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తమ్‌ సతీమణి పద్మావతి సిట్టింగ్ స్థానం, కోదాడకు సైతం అభ్యర్థిని ప్రకటించలేదు కేసీఆర్.

Similar News