‘నేల’తల్లి బాగుకోసం

Update: 2017-12-12 11:45 GMT

ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల అతి ముఖ్యమైనది. సమస్త జీవరాశులు, మానవాళి మనుగడ ఈ నేలపైనే ఆధారపడివుంది. భూమి సారవంతంగా ఉన్నపుడే పంటలు బాగా పండుతాయి. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి అన్నదాతలు ఆర్థిక పురోగతి సాధిస్తారు. రైతు బాగున్నాడంటే మిగిలిన అన్ని వర్గాలు అన్ని రంగాలు ప్రగతి పథంలో పయనిస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. అయితే అవగాహన లోపంతో నేల, నీటి సంరక్షణ  చర్యలు పాటించడం అంతంతా మాత్రంగానే ఉంది. నేల స్వభావాన్ని పరీక్షఉంచుకునేందుకు  ఏటా డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా నేలల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నేల, నీటి సంరక్షణ చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. 

అధిక దిగుబడుల ఆశతో పాటు వాణిజ్యపరమైన ఆలోచనలు ఎక్కువ కావడంతో  పంటలకు అవసరం ఉన్నా లేకున్నా విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం మొదలుపెట్టారు. దీని వల్ల నేల భౌతిక లక్షణాల్లో మార్పు రావడంతో భూములు క్రమంగా నిస్సారమై పంటలు పండటం గగనంగా మారింది. పండినా ఆహారోత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటంతో పాటు వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. అంతే కాకుండా భావితరాలకు సారవంతమైన నేలలు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది. రాబోవు కాలంలో వ్యవసాయం మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచివుంది. నేలతో పాటు నీటి సంరక్షణ చర్యలు తీసుకున్నపుడే వ్యవసాయం, సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలి. భవిష్యత్‌ తరాల మనుగడ కోసం భూమాతను చక్కగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రకృతి ప్రసాదించిన నేలను రక్షించుకునేందుకు ముఖ్యంగా రైతులు కార్యోన్ముఖులు కావాలి. 

Similar News