హమ్మయ్య...తెలంగాణలో ఓటర్ల లెక్క తేలింది!!

Update: 2018-10-13 10:39 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మరింత లైన్‌ క్లియరైంది. ఓటర్ల తుది జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో మొత్తం 2కోట్ల 73లక్షల 18వేల 603మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇంతకుముందు 20లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయన్న కాంగ్రెస్‌ వాదనకు బలం చేకూర్చేలా.... కొత్త జాబితాలో 12లక్షల పైచిలుకు ఓటర్లు అదనంగా చేరడం సంచలనంగా మారింది.

తెలంగాణ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 2కోట్ల 73లక్షల 18వేల 603మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో కోటీ 37లక్షల 87వేల 920మంది పురుష ఓటర్లు........ కోటీ 35లక్షల 28వేల 20మంది మహిళా ఓటర్లుగా లెక్కలు విడుదల చేసింది. ఇక థర్డ్‌ జెండర్లు 2వేల 663మంది ఉండగా, త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఓటర్లు 9వేల 451మంది ఉన్నట్లు సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, సుమారు 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో... దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం తుది జాబితా విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇంతకుముందు రూపొందించిన ముసాయిదా కంటే... తాజాగా ప్రకటించిన తుది జాబితాలో 12లక్షల పైచిలుకు ఓటర్లు అదనంగా చేరడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ఓటర్ల తుది జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. సీఈసీ అనుమతి రావడంతో... తుది జాబితాను అధికారికంగా రిలీజ్‌ చేశారు‌. త్వరలోనే అన్ని పార్టీలకు ఓటర్ల జాబితాను పంపిస్తామన్న రజత్‌కుమార్‌.... జిల్లాల వారీగా లిస్ట్‌ ప్రకటిస్తామన్నారు.

Similar News