శబరిమలపై సమున్నత తీర్పు... సుప్రీం చెప్పిందేమిటి?

Update: 2018-11-13 13:22 GMT

అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 49 పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని సుప్రీం తేల్చిచెప్పింది. 

శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను మాత్రం విచారణకు స్వీకరించింది. కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి శబరిమలతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో శబరిమలతోపాటు కేరళ అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసన ర్యాలీలు నిర్వహించారు. 

మాస పూజల నిమిత్తం అక్టోబరు 17న ఆలయాన్ని తెరవగా ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించడంతో భక్తులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం సైతం నెలకొంది. మరోవైపు సుప్రీం తీర్పును సవాల్‌ చేస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు సహా పలువురు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మొత్తం 49 రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో... వాటన్నింటినీ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.... జనవరి 22న బహిరంగ కోర్టులో విచారించేందుకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌తోపాటు న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారిమన్, ఏకే ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల బెంచ్... రివ్యూ పిటిషన్లను విచారించనున్నారు. అయితే శబరిమల వివాదంపై బహిరంగ విచారణ జరుపుతామన్న సుప్రీం నిర్ణయాన్ని రివ్యూ పిటిషనర్లు స్వాగతించారు.

Similar News