టైటిల్ : సమ్మోహనం
జానర్ : ఎమోషనల్ లవ్ డ్రామా
తారాగణం : సుధీర్ బాబు, అదితి రావు హైదరీ, నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, హరితేజ
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
తనదైన శైలిలో విభిన్న చిత్రాలని తెరకెక్కిస్తూ అభిరుచి గల దర్శకుడిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గుర్తింపు పొందారు. ఆయన తెరక్కించిన అష్టాచమ్మా, జెంటిల్ మాన్, అమితుమీ వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. కమర్షియల్ అంశాలపై ఆధారపడంకుండా తాను చెప్పదలుచుకున్న పాయింట్ తోనే ఆడియన్స్ కి ఆకట్టుకోవడం ఆయన శైలి. ఈ దర్శకుడి నుంచి తాజాగా వచ్చిన చిత్రం సమ్మోహనం. సుధీర్ బాబు. అదితి రావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహనకృష్ణ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా..? లవర్ బాయ్‌గా సుధీర్ బాబు ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?
కథ: విజయ్‌కుమార్ (సుధీర్‌బాబు) చైల్డ్ ఇల్లస్ట్రేటర్. తనకు సినిమా వాళ్లంటే ఇష్టం ఉండదు. వారు సినిమాలో చూపించేదంతా నటనే.. వారికి ఎమోషన్స్ ఉండవు .. అనేటువంటి భావనలుంటాయి. అయితే విజయ్ తండ్రి శర్వా(సీనియర్ నరేశ్)కి మాత్రం సినిమాలంటే ఎంతో అభిమానం ఉంటుంది. రిటైర్మెంట్ అయినా తర్వాత సినిమాల్లో రాణించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. తను ఓ సందర్భంలో సినిమా యూనిట్‌కు వాళ్ల ఇంటికి ఫ్రీగా అద్దెకిస్తాడు. అయితే సినిమాలో తనకో క్యారెక్టర్ ఉండాలే నిబంధన పెడతాడు. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్(అదితిరావు హైదరి). ఈమెకు తెలుగు రాదు. విజయ్‌ని తన సినిమాకు తెలుగు డైలాగ్స్ నేర్పించమని కోరుతుంది సమీరా. విజయ్ కూడా సరేనంటాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సమీర కొన్ని పరిస్థితుల కారణంగా తన ప్రేమను వ్యక్తం చేయదు. విజయ్ చెప్పిన ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దాంతో విజయ్ డిస్ట్రబ్ అవుతాడు. తిరిగి విజయ్ మామూలు మనిషి అవుతాడా? అసలు సమీరా.. విజయ్ ప్రేమను ఎందుకు తిరస్కరిస్తుంది? ఇద్దరూ ఒకటవుతారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటులు ; విజయ్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ జీవించారు. స్టార్ ఇమేజ్, ప్రేమ, వేదింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్రా లోకేష్ హుందాగా కనిపించారు. ముఖ్యంగా సుధీర్ బాబు, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌గా రాహుల్ రామకృష్ణ, అభయ్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రలో తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ: సినిమాల మీద పెద్దగా ఒపీనియన్ లేని హీరోకీ, నటనే ప్రాణంగా భావించి సక్సెస్‌లో ఉన్న అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. పేరుకి ఇది ప్రేమ కథే అయినా సినిమా ఆద్యంతం ఎక్కడికక్కడ ఉపనదులను కలుపుకొని ప్రవహించే జీవనదిలా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త కామన్‌గా ఉంటుంది. డైలాగులు బావున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు గొప్పదనం గురించి, సినిమా వాళ్లను చూసి మామూలు జనాలు చెప్పుకొనే మాటలను చాలా రాశారు. తెలుగు ప్రాముఖ్యత గురించి చెబుతూనే మరోవైపు హీరో తో పాటు హీరో తల్లి తదితర పాత్రలన్నీ ఇంగ్లిష్‌లో సంభాషణలు చెప్పడం కాసింత అసహజంగా అనిపిస్తుంది. కానీ సినిమాలో హీరో ఫ్యామిలీని అప్పర్ మిడిల్ క్లాస్‌గా చూపించారు కాబట్టి ఫర్వాలేదనుకోవచ్చు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. పాటలు కూడా చాన్నాళ్ల తర్వాత బాగా అర్థవంతంగా అనిపించాయి. సన్నటి కథను సినిమాగా మలిచి, ఎక్కడా బోర్ కొట్టకుండా పాజిటివ్ వేలో చెప్పి మెప్పించగలిగారు ఇంద్రగంటి. శ్రీదేవి మూవీస్ సంస్థ అందించిన నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపించాయి. ఆర్ట్, కెమెరా వర్క్స్ గురించి ప్రస్తావించాల్సిందే. సుధీర్‌బాబు గత చిత్రాలతో పోలిస్తే మనిషి చాలా బావున్నాడు. ఎక్స్ ప్రెషన్స్ కూడా పలికాయి. అదితీరావు నోట తెలుగు మరింత మధురంగా వినిపించింది. నటీనటులందరూ వారి వారి పరిధులు మేర చక్కగా నటించారు. ముఖ్యంగా సీనియర్ నరేశ్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. ఆర్టిస్ట్ కావాలనుకుని కాలేకపోయి.. చివరకు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తర్వాత నటుడిగా రాణించాలని కలలు కనే వ్యక్తి. అవకాశాల కోసం ఎదురుచూడటం.. దాని వల్ల సందర్భానుసారం వచ్చే కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆఖరున తనికెళ్ల భరణి చదివి వినిపించే `బుజ్జి ` కథ సాగదీత అవుతుందేమోనని ప్రేక్షకులు భయపడే మాట వాస్తవమే. కానీ ఆ కథను క్లైమాక్స్ కు అందంగా ముడిపెట్టి ముగింపునివ్వడం బావుంది. పవిత్రా లోకేష్‌కి చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా అవుతుంది.