శబరిమలలో ఇంకా తగ్గని గోల.. తెరిచాక తెగిస్తారా?

Update: 2018-11-05 10:59 GMT

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చు అంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును అయ్యప్ప భక్తులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీర్పు అనంతరం తొలిసారిగా అక్టోబరు 17 నుంచి 22 వరకు శబరిమల ఆలయ ద్వారాలను తెరిచారు. ఆ సమయంలో కొందరు మహిళా భక్తులు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా సోమవారం నుంచి మరోసారి శబరిమల ఆలయం తెరుచుకోనుంది. ఈ నేపథ్యంలో గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఇప్పటివరకు ఏ మహిళా భక్తురాలు తమను సంప్రదించలేదని, ఒకవేళ ఎవరైనా వస్తే సుప్రీంకోర్టు తీర్పు అమలుపరిచేలా చూస్తామని పోలీసులు చెబుతున్నారు

నవంబర్ 5న  మరోసారి శబరిమల ఆలయాన్ని తెరవనుండటంతో దేశం దృష్టి మొత్తం శబరిమలపై పడింది. కొంతమంది మహిళలు లోపలికి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని తెలియడంతో భక్తులు మళ్లీ అలర్ట్ అయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఎలవున్కల్‌, నీలక్కల్‌, పంబ, సన్నిధానం తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నవంబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

మాస పూజల కోసం నవంబర్ 5 సాయంత్రం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుండటంతో భక్తులు మళ్లీ అలర్ట్ అయ్యారు. గతంలో లాగే ఈసారి కూడా పలువురు మహిళలు ఆలయ ఎంట్రీకి సిద్దపడుతుండటంతో వారిని అడ్డుకునేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో మీడియా సంస్థలకు కూడా వారు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. శబరిమల ఆలయం వద్దకు మహిళా జర్నలిస్టులను పంపించి.. ఉద్రిక్తతలకు తావు ఇవ్వవద్దని కోరుతున్నారు. తమ వృత్తి ధర్మంలో భాగంగానే మహిళా జర్నలిస్టులు ఆలయ ప్రవేశం కోసం వస్తున్నప్పటికీ.. అది ఉద్రిక్తతలకు తావిచ్చే అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని లేఖ ద్వారా కోరారు. శబరిమల కర్మ సమితి, విశ్వహిందూ పరిషత్, హిందూ ఐక్యవేదికలతో కూడిన రైట్ వింగ్స్ సంయుక్త వేదిక మీడియా సంస్థలకు ఈ విజ్ఞప్తి చేసింది. 

Similar News