టైటిల్ : రంగుల రాట్నం
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : రాజ్ తరుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి
సంగీతం : శ్రీచరణ్ పాకల
దర్శకత్వం : శ్రీ రంజని
నిర్మాత : నాగార్జున అక్కినేని
యువ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా మారిన రాజ్ తరుణ్ వరుస విజయాలను అందుకొన్నాడు. సినిమా చూపిస్త మావ, కుమార్ 21ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు చిత్రాలు సక్సెస్ సాధించడంతో నిర్మాతలకు నమ్మకం ఉన్న హీరోగా రాజ్ తరుణ్ మారాడు. ఈ నేపథ్యంలో తాజాగా రంగులరాట్నం చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకాడు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ అందుకొన్నాడా? ప్రేక్షకులను మెప్పించాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ :
విష్ణు (రాజ్ తరుణ్) బాధ్యత తెలియకుండా పెరిగిన కుర్రాడు. తల్లి(సితార) గారాభం చేయటంతో ఏ పనీ సొంతం గా చేసుకోకుండా అన్నింటికీ తల్లి మీద ఆధారపడుతుంటాడు. పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని అమ్మాయిని చూడటం మొదలు పెడుతుంది విష్ణు తల్లి. అయితే అదే సమయంలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే కీర్తి(చిత్రా శుక్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు విష్ణు, ఆ అమ్మాయితో పరిచయం పెంచుకునేందుకు అమ్మ పుట్టిన రోజు పార్టీ అని కీర్తిని ఇంటికి పిలుస్తాడు. అలా వారిద్దరి పరిచయం స్నేహంగా మారుతుంది. కానీ కీర్తికి ప్రేమ విషయం చెప్పేలోపే విష్ణు తల్లి చనిపోతుంది. తల్లి చనిపోయిన బాధలో ఉన్న విష్ణు ఆ బాధనుంచి ఎలా బయటపడ్డాడు..? కీర్తికి ఎలా దగ్గరయ్యాడు..? కీర్తి ఓకె చెప్పిన తరువాత విష్ణు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? చివరకు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
యువ నటుల్లో రాజ్ తరుణ్ హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న రాజ్ తరుణ్ గతేడాది అంధగాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్నాడు. ఈ సారి అన్నపూర్ణ బ్యానర్లో రంగుల రాట్నంతో వస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. మరీ సంక్రాంతి రేసులో దూకే సరికి మరింత ఆసక్తి పెరిగింది. కానీ రాజ్ తరుణ్ తన బాడీ లాంగ్వేజికి ఏ మాత్రం సరిపడని క్యారెక్టర్ కనిపించాడు. తన ప్రతిభతో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి అవకాశమే లభించలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలలో సెంటిమెంట్‌ను పండించాడు. హీరోయిన్గా పరిచయం అయిన చిత్ర శుక్లా పరవాలేదనిపించింది. తల్లి పాత్రకు సీనియర్ నటి సితార ప్రాణం పోసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడ ప్రియదర్శి కామెడీ కాస్త నవ్విస్తుంది.
విశ్లేషణ :
తొలి చిత్రంగా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఓ సాధారణ ప్రేమకథను ఎంచుకున్న దర్శకురాలు శ్రీరంజని, ఆ కథను ఆసక్తికరంగా తెర మీద ఆవిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. ఏ దశలోనూ ఆడియన్ను కథలో లీనం చేయలేకపోయారు. బలమైన ఎమోషన్స్, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవటం నిరాశకలిగిస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ మరింత బలంగా చూపించేందుకు అవకాశం ఉన్నా.. అలాంటి సన్నివేశాలపై పెద్దగా దృష్టిపెట్టినట్టుగా అనిపించదు. శ్రీచరణ్ అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్
ప్రియదర్శి
నిర్మాణ విలువలు
సితార పాత్ర
మైనస్ పాయింట్స్
శ్రీరంజనీ డైరెక్షన్ కథ,
కథనం కామెడీ ట్రాక్ సంగీతం,
పాటలు