24 గంటల్లో తేల్చండి.. లేకపోతే! : పవన్

Update: 2018-04-20 10:33 GMT

పరుష పదజాలంతో తన తల్లిని దూషించిన వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యాడు. ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని  పక్కా ప్లాన్ ద్వారా ... ముందే రచించిన స్క్రిప్ట్  ప్రకారం జరిగిన వ్యవహారమంటూ మండిపడ్డారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకుండి నడిపించిన బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదంటూ మా అసోషియేషన్‌పై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం ప్రదర్శించారు. తన తల్లికి న్యాయం చేసే వరకు ఫిలిం ఛాంబర్‌ వదలి వెళ్లేది లేదని అక్కడే భైఠాయించారు.  భారీగా తరలివచ్చిన అభిమానులు, జనసేన కార్యకర్తలతో ఫిలిం చాంబర్ నినాదాలు మార్మోగింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

తనపై జరుగుతున్న కుట్రపై స్పందించాలని లేకపోతే దీక్షకు దిగుతానంటూ పవన్‌ హెచ్చరించడంతో ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందారు.  ఈ సందర్బంగా  పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు  మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతోపాటు అల్లు అరవింద్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, జీవి, రమేశ్‌ మెహర్‌ చేరుకున్నారు. అయితే మరింత ముదరకుండా జాగ్రత్త పడిన సీని ప్రముఖులు పవన్‌తో చర్చించారు. పవన్‌తో పాటు  కుటుంబ సభ్యులతో సమావేశమయ్యి తాజా పరిణామాలపై చర్చించారు. 24 గంటల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని హామి ఇవ్వడంతో పవన్ కళ్యాణ్  తాత్కాలికంగా తన దీక్షను వాయిదా వేసుకున్నారు. అనంతరం తన వాహనంలో నివాసానికి వెళ్లారు. 

తాజా పరిస్దితుల నేపధ్యంలో 24 గంటల తరువాత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణ‍యం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది.  మా అసోషియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడనేది  ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 

Similar News