నిజామాబాద్‌ రూరల్‌కి... రూలర్‌ ఎవరు?

Update: 2018-09-26 05:58 GMT

ఒకరు మాస్ లీడర్.. మరొకరు ఉద్యమ నేత.. ఇంకొకరు పట్టువదలని విక్రమార్కుడు.. ఇలా ఆ ముగ్గురు నేతలు ఒకరికి మించి మరొకరు నియోజకవర్గంలో పట్టుకోసం పోటీపడుతున్నారు. గెలుపే లక్ష్యంగా గ్రామాలను చుట్టొస్తున్నారు. విలక్షణ తీర్పు నిచ్చే నిజామాబాద్ రూరల్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఆ ముగ్గురి నేతల్లో ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నిజామాబాద్ రూలర్ ఎవరు?

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రాజకీయం రంజుగా మారింది. ఒకప్పుడు డిచ్‌పల్లి నియోజకవర్గంగా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనలో రూరల్ నియోజకవర్గంగా ఆవర్బవించింది. జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ నాలుగు మండలాలు ఉండగా.. లక్షా 90వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో మున్నూరు కాపు, ఎస్సీ,ఎస్టీలు, ముదిరాజ్‌లు అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్ధాయిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్‌కు టికెట్టు ఖరారు కాగా.. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇంకా అభ్యర్ధులను అధికారికంగా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, బీజేపీ నుంచి ఆనంద్‌రెడ్డి లు ముందస్తు ప్రచారం ప్రారంభించారు. 

ఎమ్మెల్సీ భూపతిరెడ్డి.. అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. బాజిరెడ్డి ఓటమే తన లక్ష్యమంటూ ఆయన హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీలో నయాజోష్ కనిపిస్తోంది. భూపతిరెడ్డికి రూరల్ టికెట్టు దాదాపు ఖరారు కావడంతో.. ఆయన మల్కాపూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. భూపతిరెడ్డికి.. రూరల్ నియోజకవర్గంపై పట్టు ఉన్న డీఎస్‌ ఆశీస్సులు ఉండటం., కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. ఉద్యమ నేతగా ఉన్న గుర్తింపు అదనపు బలంగా మారాయి. ఐతే క్లాస్ లీడర్‌గా ఉండే భూపతిరెడ్డి మాస్ లీడర్ బాజిరెడ్డిని ఎలా ఢీ కొంటారన్నది ఉత్కంఠగా మారింది. బీజేపీ అభ్యర్ధి గడ్డం ఆనంద్‌రెడ్డి చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. అందరి కంటే ముందుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించి నియోజకవర్గాన్ని చుట్టొచ్చారు. పార్టీ అభ్యర్దిగా ఆనంద్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనా.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో 25శాతం ఓట్లతో మూడోస్ధానంలో నిలిచిన ఆనంద్... ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, మోడీ చరిష్మా, కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు ఆనంద్‌రెడ్డి.

రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు నేతల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. విలక్షణ తీర్పు నిచ్చే రూరల్ ఓటర్ల నాడి అంతు చిక్కక అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఓటరుపై భారం వేసి ప్రచార హోరు పెంచారు. రూరల్ బరిలో రూలర్‌గా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News