రోజుకో మలుపు తిరుగుతున్న శిల్ప ఆత్మహత్య కేసు

Update: 2018-08-10 11:31 GMT

ఎస్వీ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని శిల్ప ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు శిల్ప ఆత్మహత్య ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంటే...ప్రిన్సిపాల్ రమణయ్యను సస్పెండ్ చేయడంపై ఎపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మండిపడుతోంది. డాక్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ జయధీర్ బాబు నేతృత్వంలో ఇవాళ సమావేశమైన వైద్యుల సంఘం... శిల్ప మృతిపై తమకూ అనుమానులున్నాయని అంటోంది. నిజానిజాలు తేలాలంటే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రొఫెసర్లను తాము వేనకేసుకు రావడం లేదన్న జయధీర్ బాబు..నిందితుల వాదన కూడా వినాలని కోరారు.  

శిల్ప ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ ఎన్వీ రమణయ్యను బలిపశువుని చేశారని వెంటనే ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలని ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఘటనలో సంబంధంలేని ప్రిన్సిపాల్  ను తొలగించడం అన్యాయమని అంటోంది. రమణయ్యపై చర్యలు ఉపసంహరించుకోకపోతే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించింది. రమణయ్య విషయంలో ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇస్తున్నామనీ ఆ రోజు సాయంత్రంలోగా ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఎపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత జయధీర్ బాబు  తెలిపారు.

మరోవైపు శిల్ప ఆత్మహత్య కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులపై తీసుకున్న చర్యలు తూతూ మంత్రంగా ఉన్నాయని పెదవి విరిచారు. శిల్ప చావుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాల్సిదేనని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్లే విద్యార్థినులు కొందరు ప్రొఫెసర్ల వేధింపుల బారిన పడుతున్నారని శిల్ప భర్త చెప్పారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
 

Similar News