కూటమిలో సీటుపోట్లు... పంచాయతీ తేలేదెపుడు!!

Update: 2018-11-12 05:13 GMT

మహాకూటమిలో సీట్ల పంపకం కాంగ్రెస్‌లో కల్లోలం రేపడం అప్పుడే మొదలైంది. కేవలం ఎన్ని స్థానాలు, ఏయే పార్టీకి ఖరారయ్యాయో, ప్రకటించిన కాంగ్రెస్, ఎవరికి ఏ సీటో లీకులుస్తుండటంతో, ఆశావహులకు షాక్‌ తగులుతోంది. దీంతో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌ అసంతృప్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఏళ్లతరబడి కాంగ్రెస్‌ కోసమే కష్టపడి, త్యాగాలు చేసి, ఈసారైనా తమకు సీటు  వస్తుందనుకుని, అనధికారికంగా ప్రచారం చేసి, ఇప్పుడు కూటమి కారణంగా, ఇతర పార్టీలకు సీటు ఇవ్వడాన్ని, కాంగ్రెస్‌ ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌లో ఆందోళనలు ప్రారంభించారు. ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు ఓవైపు ప్రయత్నాలు చేస్తుండగానే .. రాష్ట్రంలో పలు చోట్ల కార్యకర్తలు నిరనసలకు దిగారు. 

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న వార్తలపై, వివిధ నియోజకవర్గాల్లో ఆశావహులు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. అధికారికంగా జాబితా వెల్లడైన తర్వాత, తమకు అందులో చోటు దక్కకపోతే, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. అటు ఢిల్లీలోనూ ఆశావహులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు, స్థానాలు, ఇంకా అధికారికంగా ఖరారుకాకముందే, ఇలా నిరసనాగ్నులు భగ్గుమంటుంటే, ఇక అఫిషియల్‌గా ప్రకటించిన తర్వాత, కాంగ్రెస్‌లో నిజంగా భూకంపమే వచ్చేట్లు ఉంది. కాంగ్రెస్‌లో ఒక్కో స్థానం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్‌ ఆశిస్తున్నారు. ఒకవేళ బీఫాం దక్కకపోతే, రెబల్‌గా బరిలోకి దిగడమో, ఇతర పార్టీల్లోకి జంప్‌ కావడమే ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాహుల్‌ గాంధీ ఆదేశాలతో  సీినియర్ నేతలు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తు ధర్మం తప్పదని అంటున్నారు. అయినా ఆశావహులు మాట వినేలా లేరు. ఆందోళనలు మిన్నంటే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు గాంధీ భవన్‌ దగ్గర హోరెత్తిన నిరసనే టీజర్. ఇప్పటికే గాంధీభవన్‌కు ఫుల్‌ సెక్యూరిటీ కల్పించారు. గతంలో మాదిరి ఫర్నీచర్, కంప్యూటర్లు ధ‌్వంసం కాకుండా, ఎవరూ ఆత్మహత్యాయత్నం చేయకుండా, భద్రతను కట్టుదిట్టం చేశారు. రానున్న రెండు, మూడు రోజుల్లో, కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో చూడాలిక.!

Similar News