ఖమ్మం కాంగ్రెస్‌ క్యాండిడేట్స్‌పై గ్రౌండ్‌ రియాలిటీ

Update: 2018-10-29 12:16 GMT

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నామినేషన్ల దాఖలు సమయం సమీపిస్తున్న కొద్ది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్నఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పొత్తులు తేలక ఒకవైపు...సీట్లు ఖరారు అంశంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వినూత్న విధానాలు మరోవైపు నేతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. సర్వేల మీద సర్వేలు చేయిస్తూ ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.  ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపులో గతంలో మాదిరి  పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో ఓ బడా నేత చేసే సిఫార్సుల ఆధారంగా కోరిన స్థానాలు కేటాయించేవారు. ఇప్పటికీ అలాంటి నేతలు కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ వారి మాటకు మరింత విలువ చేకూరాలంటే సర్వే ఫలితాలు కూడా మద్దతుగా ఉండాలి. లేకుంటే మీరు చెప్పే అభ్యర్థి 
వాస్తవ పరిస్థితి ఇదీ... అంటూ అధిష్ఠానం నిజాలను బయటపట్టే పరిస్థితులు నెలకొన్నాయి. 

పక్కాగా.. పకడ్బందీ నిర్ణయాల వెనక పార్టీ  జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అనుసరిస్తున్న  విధానాలే కారణమంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న పకడ్బందీ విధానాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా ఉండాలని దిశా నిర్దేశం చేసే వారినే పరిశీలకులుగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ అధిష్టానం గతానికి భిన్నంగా.. గ్రౌండ్ రియాలిటీతో సర్వేలు నిర్వహిస్తోంది. ఆ ఫలితాల ఆధారంగానే టికెట్‌ల విషయంలో అభ్యర్థుల వడపోత చేపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానం 7 దశల్లో వడపోత చేపట్టింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 10 స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే 
బాగుంటుందన్న సమాచారం సేకరించింది.  మొదటి దశలో అసెంబ్లీ రద్దుకు ముందే పిసిసి ఆధ్వర్వంలో సర్వే నిర్వహించి ఢిల్లీకి నివేదిక పంపారు. రెండో దశలో ఎఐసిసి ఆధ్వర్యంలో రహస్య సర్వే నిర్వహించారు. చివరిగా స్ర్కీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో సర్వేలను వడపోసి...జిల్లా నేతలతో  ముఖాముఖి చర్చలు నిర్వహించి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పొత్తుల్లో సీట్ల ఖరారు తర్వాత ఏయే స్థానాల్లో ఎవరు  పోటీ చేయనున్నారో అధికారికంగా పార్టీ ప్రకటించనుంది. కాంగ్రెస్ అధిష్టానం గతంలో ఎన్నడూ లేనివిధంగా టికెట్ల కేటాయింపులో  అనుసరిస్తున్న వినూత్న విధానం పార్టీ సీనియర్ల నుండి సామాన్య కార్యకర్తల వరకూ చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ పెద్దల వ్యూహాలు ఫలితాలనిస్తాయా లేదా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే....

Similar News