ఏపీలో పొలిటికల్‌ జంగ్... జగన్‌ వర్సెస్‌ పవన్‌

Update: 2018-11-17 06:23 GMT

జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జగన్‌ టార్గెట్‌గా పవన్‌ చేసిన కామెంట్స్‌కు వైసీపీ నేతలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇంతకీ జనసేనానికి జగన్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారు? జనసేనాని వైసీపీని టార్గెట్‌ చేశారు. ఇంతకాలం ప్రభుత్వాన్ని ఏకి పారేసిన పవన్‌... ఇప్పుడు జగన్‌పై మాటల దాడి తీవ్రతరం చేశారు. కోడికత్తి దాడితో పాటు హోదా విషయంలో వైసీపీ పారిపోయిందని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ, జనసేనల మధ్య సంధి రాయబేరం బెడిసి కొట్టిందా ? 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం సాధ్యం కాదని తెలిసి పోయిందా ? పొత్తుల కోసం మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయా ? జగన్ టార్గెట్్గా  పవన్ వ్యాఖ్యలు చేయడం భవిష్యత్‌‌ రాజకీయాలను స్పష్టం చేస్తోందా ?   

అదిగో పొత్తులు, ఇదిగో మధ్యవర్తిత్వం అంటూ  ఏపీ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న వేళ ... వైసీపీ , జనసేనల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ టార్గెట్‌గా పవన్ విమర్శలకు పదును పెట్టారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మోస్తున్న  పవన్ ..  అసలు అజెండా చెప్పాలంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన ఆయన తాజాగా .. ప్రతిపక్ష నేత జగన్‌పై మాటల దాడికి దిగారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ ప్రధానంగా జగన్‌నే టార్గెట్‌ చేసుకున్నారు. కోడికత్తి నుంచి ప్రజా సంకల్పయాత్ర వరకు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 

పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన వైసీపీ నేతలు ..ఇదేనా మీరు చెబుతున్న కులతత్వ సమాజం అంటూ సూటిగా ప్రశ్నించారు. రోజుకో మాట పూటకో బాట పట్టే పవన్ ... తమ అధినేతను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 2009లోనూ ఇదే తరహాలో స్ధాయికి మించి విమర్శలు చేసి నవ్వుల పాలైన విషయం గుర్తుంచుకోవాలంటూ సూచించారు. వైసీపీ, జనసేనల మధ్య మాటల మంటలపై టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా  ....తాజా పరిణామాలపై రాజకీయ విశ్లేషకులు భిన్న భావనలు వ్యక్తం చేస్తున్నారు. 2019 నాటికి ఇరు పార్టీలు టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు.

Similar News