ఒకవేళ నేను చనిపోతే పోరాటంలో చనిపోయానని అనుకుంటే చాలు: పవన్‌

Update: 2018-04-20 05:44 GMT

రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి వివాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తన తల్లిని తిట్టడంపై ట్విట్టర్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేర్లు రాయకుండా శ్రీరెడ్డి గురించి, రాంగోపాల్ వర్మ గురించి పవన్ విమర్శలు గుప్పించారు. ఏ కొడుకు వినకూడని తప్పుడు పదంతో నా తల్లిని తిట్టించారని పవన్ అన్నారు. నా తల్లి ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళ అన్న పవన్‌ కల్యాణ్‌...మా అమ్మకు భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియదని చెప్పారు. ఎవరికి ఉపకారం తప్ప... అపకారం చేయని మనస్తత్వం ఆమెదని కొనియాడారు. అలాంటి మంచి వ్యక్తిని అందరూ కలిసి నడిరోడ్డులో తిట్టించడం బాధాకరమని పవన్‌ వ్యాఖ్యానించారు.

శ్రీరెడ్డి విషయంలో మీడియా ప్రవర్తిస్తున్న తీరుపైనా పవన్ విరుచుకుపడ్డారు. శ్రీరెడ్డి తిట్టిన తిట్టుని పదేపదే టీవీల్లో ప్రసారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పైగా దాని గురించి గంటల కొద్దీ డిబేట్లు పెట్టి రచ్చ చేశారని మండిపడ్డారు. ఎంతో పెద్ద స్థాయి మనుషులు సమాజం పట్ల బాధ్యత గల మీడియా వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారా అని పవన్ ప్రశ్నించారు. విజ్ఞత గల వ్యక్తులు ఇంతలా దిగజారుతారా.. అని నిలదీశారు. తప్పుడు పదాన్ని వాడమని ఒకరు సలహా ఇచ్చి...అలా అనిపిస్తే మీడియా వ్యక్తులు దానిని అస్తమానం ప్రసారం చేసి విజ్ఞత కోల్పోయారని విమర్శించారు.

ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందకెళ్తున్నానని పవన్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అసలు చనిపోయే వాడికి ఓటమి భయం ఉంటుందా అని ప్రశ్నించారు. సంబంధం లేని వ్యక్తులను వివాదాల్లోకి లాగిన తర్వాత పరువు పోతుందని భయపడతారా అని అన్నారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను చనిపోతే...నిస్సహాయులకు అండగా, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలానని అనుకుంటే చాలని పవన్ కల్యాణ్ కోరారు. ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ప్రజలకు తరుఫున పోరాడి చనిపోయాడని అనుకుంటే చాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  

Similar News