చంద్రబాబుకు హరీష్‌రావు లేఖ... సారాంశం యథాతథం

Update: 2018-11-08 11:04 GMT

తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయడంపై ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్న మంత్రి హరీష్‌రావు... చంద్రబాబుకు 19 ప్రశ్నలను సంధించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబుకు తెలంగాణ పదమే గిట్టదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని హరీష్‌ ఆరోపించారు. కేంద్రానికి రాసిన లేఖలను బయటపెట్టారు. చంద్రబాబును చూసి... ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని, అంతలా రంగులు మారుస్తున్నారంటూ హరీష్‌ ఎద్దేవా చేశారు.. బాబుది ఎంత సంకుచిత ధోరణో, ఎంత మరుగుజ్జుతనమో... హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించి భవనాలను చూస్తే తెలుస్తుందన్నారు. . చంద్రబాబు... అప్పుడూ ఇప్పుడూ తెలంగాణ వ్యతిరేకేనన్న హరీష్‌రావు... తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజలందరికీ ఆనందం కలిగిస్తే, మీరు బాధ పడలేదా? విభజన మాయని గాయమని అనలేదా? గవర్నర్ ప్రసంగంలోనూ ఇదే విషయం చెప్పించి మీ కసి తీర్చుకోలేదా? ఇది మీకున్న తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం కాదా? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మీరు చేసిన ద్రోహాల్లో, మీరు పన్నుతున్న కుట్రల్లో కొన్నింటిని మాత్రమే నేనిక్కడ ఆధారాలతో సహా బహిర్గతం చేశాను. తెలంగాణ ప్రగతి నిరోధకుడిగా మారిన మీకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉంటుందా? తెలంగాణను బలిపీటం ఎక్కించడానికి మీరు అధికారపీఠం కోరుకోవడం ఎంతటి రాక్షసత్వం? ఇదీ.. మంత్రి హరీష్‌రావు ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ రాసిన లేఖలోని సారంశం. 

Similar News