గణపయ్యను ఎందుకు నిమజ్జనం చేస్తారు? సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి?

Update: 2018-09-22 09:10 GMT

గణేశుడ్ని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేయాలి? నవరాత్రుల పాటూ పూజించిన తర్వాత ఆఖరుగా నిమజ్జనం చేయడం. దీని అర్ధమేంటి? వినాయకుడ్ని మాత్రమే ఎందుకిలా నిమజ్జనం చేస్తారు? దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. సమాధానం దొరకని ప్రశ్నగా వెంటాడుతుంది. నిమజ్జనం వచ్చిందంటే చాలు గణపతిబప్పా మోరియా నినాదాలు మిన్నంటుతాయి. వినాయక విగ్రహాలు వూరేగుతూ ఏ చెరువులు గుంటల్లోనూ నిమజ్జనమవుతాయి. అత్యంత పవిత్రంగా విగ్రహాలు పెట్టి.. పూజాధికాలు నిర్వహించి.. గంగలో కలపడం వెనుక అంతరార్ధం ఏంటి?

వినాయక విగ్రహం సృష్టించి- దాన్ని పూజించి- ఆఖరున నిమజ్జనం చేయడం సృష్టి- స్థితి- లయలకు నిదర్శనమా? లేక వినాయక నిమజ్జనంలో మరేదైనా పరమార్ధం దాగి వుందా? గణపతి పుట్టుక- పూజ- నుంచి నిమజ్జనం వరకూ ప్రతిదాన్లో సామాజిక, ఆయుర్వేద, ఇతర పర్యావరణ కోణాలు ఆకళింపు చేసుకోవాలి. 1893కు ముందు భారతదేశంలో వినాయక చవితి వేడుకల్లేవు. అసలు పండగ చేసుకోవడం... ఎవరికి వారు నిమజ్జనం చేసుకోవడం ఉండేవి. అసలు భారతీయులు వినాయక చవితి ఇంతలా జరుపుకోడానికి కారణం తెల్లదొరలకు వ్యతిరేకంగా చర్చలు జరపడానికి. అలా స్వాతంత్ర సమరంలో పాల్గొంటున్న వారందరూ ఒకచోట చేరడానికి వేదికగా మారింది వినాయక చవితి వేడుక. బాలగంగాధర్ తిలక్ వంటి నేతలు ఈ దృష్టితోనే వినాయక చవితిని భారీ ఎత్తున చేయడం ప్రారంభించారు. 

అసలు వినాయకుడి  పూజ- నిమజ్జన కార్యక్రమాల్లో ఏయే అంశాలు దాగి ఉన్నాయో చూద్దాం. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. భూమి తల్లి కూడా అప్పుడప్పుడే వానలకు తడిసి వుంటుంది. గ్రామాలు, పట్టణాలన్న తేడా లేకుండా చెరువులు మరింత జలకళతో కనిపించాలంటే.. వాటి పూడిక తీయడం అవసరం. తద్వారా వచ్చే బంకమట్టితో వినాయక ప్రతిమలు చేయడం వల్ల.. దానికి 21 రకాల పత్రులతో నవరాత్రుల పాటూ పూజలు చేయడం వల్ల.. మరిన్ని ప్రయోజనాలున్నాయట. ఇవన్నీ నవరాత్రులయ్యాక వినాయక విగ్రహాలతో కలగలసి ఆయా చెరువులూ కుంటల్లో కలుస్తాయి. వీటి ద్వారా ఆ నీళ్లకు విశేష ఔషధ గుణాలు తోడవుతాయి. ఆ నీటికి మినరల్ పవర్ కలుస్తుంది. అందుకే వినాయక నిమజ్జనం సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి ప్రతీక. సర్వేజనా సుఖినోభవంతుకు నిలువెత్తు నిదర్శనంగా భావిస్తారు. ఇప్పటి వినాయక నిమజ్జనం పర్యావరణ ప్రహసనంగా తయారైంది. నిమజ్జనం తర్వాత ఔషధ గుణాలతో అలరారాల్సిన చెరువులు విషతుల్యమైపోతున్నాయి. ఇందుకు మారిన కాలమే కారణం. మట్టి వినాయకుడు- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కళకళలాడ్డమే ఇందుకు మెయిన్ రీజన్ అంటున్నారు.
 

Similar News