ముందస్తు మేఘాలు కమ్ముకుంటాయా? వీడిపోతాయా?

Update: 2018-09-03 12:24 GMT

ముందస్తు మేఘాలు కమ్ముకుంటున్నాయా? మబ్బులు వీడిపోతున్నాయా? ప్రగతి నివేదన సభకు ముందు ముందుస్తు ప్రకటనలు... సభాస్థలి నుంచే సమరభేరి నినాదాలు... ఇలా కొంగరకలాన్‌ సభపై ఎవరి అంచనాలు వారివి... ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం కర్ర విరగకుండా.. పాము చావకుండా డిప్లొమాటిక్‌గా మాట్లాడారు.? ఇంతకీ ముందస్తు ఉంటుందా? ఉట్టి ఊహాగానాలేనా?

ప్రగతి నివేదన సభ నుంచే ముఖ్యమంత్రి తెలంగాణలో ఎన్నికల రణనినాదం చేస్తారన్న విశ్లేషణలు విమర్శలకు తావిస్తున్నాయి. ఎన్నికలు షెడ్యూల్్ ప్రకారమే జరుగుతాయని కానీ... ముందుగానే వస్తాయని అని కానీ ఎక్కడా మాట తూలకుండా సీఎం డిప్లోమాటిక్‌గా మాట్లాడారు. ఇంటింటికి నల్లా నీరు ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగనన్న మాటను తాను తప్పడం లేదన్నారు కేసీఆర్‌. నవంబరు నాటికి ఇంటింటికి నీరు ఇచ్చి తీరుతామన్నారు. అంటే డిసెంబరులో ఎన్నికలు వస్తాయా? రాజకీయ విశ్లేషకుల మాట ఇదే.

ఇక ప్రసంగం చివరలో ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో ముందస్తు ఎన్నికలపై రకరకాల ఊహాగానాలు వస్తునాయన్న కేసీఆర్‌.. తెలంగాణ భవిష్యత్తు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. మరి ఇది ముందస్తుకు సంకేతంగానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ప్రగతి నివేదన సభ నుంచి ముందస్తు భేరీపై రాజకీయ పార్టీలు వేసుకున్న అంచనాలు.. అభిప్రాయాలు.. కేసీఆర్‌ వ్యాఖ్యలతో ఎటూ నిర్ణయించలేకపోతున్నాయంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తు రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటామన్న సీఎం... ఒకరకంగా ముందస్తు సంకేతాలు ఇచ్చినట్టేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమైనా ముందస్తుకు అటు ఇటుగా కేసీఆర్ చెప్పిన నిర్ణయాత్మకమైన మాటపై విశ్లేషణలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.

Similar News