హైదరాబాద్‌ మానసపుత్రిక అయితే.. అమరావతి కథేంటి మరి!

Update: 2018-11-29 09:19 GMT

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అన్నట్లు.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడికెళ్లినా హైదరాబాద్ ను తన మానస పుత్రికగా ప్పుకుంటుంటారు. విభజన తర్వాత పూర్తిగా ఏపీకే పరిమితమైపోయిన చంద్రబాబు హైదరాబాద్లో  ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈనగరంపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు..

మహాకూటమి తెలంగాణ ఎన్నికల ప్రచారం ఒక అరుదైన దృశ్యాన్ని.. అగ్ర నేతల భావోద్వేగాలను ఒడిసి పట్టింది.ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వచ్చిన చంద్రబాబు ముఖంలో ఆ భావోద్వేగం స్పష్టంగా కనిపించింది.విభజన తర్వాత ఏపీకే  పరిమితమైన చంద్రబాబు.. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నా  ముఖ్యమంత్రి కాబట్టి ఏపీలోనే ఎ క్కువగా ఉంటున్నారు...హైదరాబాద్ వచ్చినా వ్యక్తిగత పనులు చూసుకోడం లేదా పార్టీ కార్యాలయానికి హాజరవడం మినహా ఎక్కడా బహిరంగంగా కనిపించింది లేదు.. కానీ హైదరాబాద్ గురించి మాత్రం ఏపీలో ఉన్నా తరచుగా తలచుకుంటూనే ఉంటారు..  తాజాగా ఎన్నికల ప్రసంగం కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు వేదికపై మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు  పట్టలేని సంతోషంతో కనిపించారు..

హైదరాబాద్ అభివృద్ధిని తానే చేశానని మరోసారి ఆయన సగర్వంగా చెప్పుకున్నారు.. హైదరాబాద్ లో మెరికల్లాంటి యువత ఉందన్నారు.. ఇదొక నాలెడ్జ్ కేంద్రం అన్నారు.. హైదరాబాద్ ను చంద్రబాబు పొగిడినప్పుడల్లా జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక్కడకు రాగానే తనకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయంటూ తన్మయుడైపోయారు.. హైదరాబాద్ పై ఆయనకున్న మక్కువ, ప్రేమ మరోసారి బయటపడ్డాయి. మెట్రో రైలు నుంచి, సైబరాబాద్ నిర్మాణం వరకూ నగరాభివృద్ధిలో తన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించి గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు..

హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లు, గ్రేటర్ ఓటర్లను ఆకట్టుకోడానికి మహాకూటమి చాలా సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. చంద్రబాబు తన గొప్పతనాన్ని, తన పనితీరును ప్రస్తావిస్తే.. 95  సీట్లలో పోటీకి నిలిచిన కాంగ్రెస్ కూడా టీడీపీకి జీ హుజూర్ అంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సైతం చంద్రబాబును ప్రశంసించారు. హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ పూర్తిగా చంద్రబాబుదేనని మెచ్చుకున్నారు. వీరిద్దరి ప్రసంగాలు చూస్తే రాహుల్, చంద్రబాబు చాలా సమన్వయంతోనే అడుగులు వేస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది.

Similar News