ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా సజీవంగానే ఉందా?

Update: 2018-02-18 06:13 GMT

ఏపికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఇంకా ఉందా? అందరూ ఒక్కటైతే ఆ డిమాండ్ నెరవేరుతుందా?  ఆ అవకాశాలెంత మేరకున్నాయో తెలీదు కానీ నేతలైతే.. గట్టిగా ఉద్యమిస్తే..  వచ్చే అవకాశాలున్నాయనే అంటున్నారు.

ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా సజీవంగానే ఉందా?
విభజన జరిగి నాలుగేళ్లయ్యాక సార్వత్రిక ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న సమయంలో హోదా డిమాండ్ మరోసారి రేగుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం హడావుడిగా బలవంతంగా ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పరిణామాల నుంచి మరోసారి లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ, టీడీపీ రెండు పార్టీలూ కలసి ఏపిని నట్టేట ముంచాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విభజన చట్టం సరిగా రాయలేదని విమర్శించే వారు దానిని సరిదిద్దేందుకు తమతో కలసి  రావాలంటూ పిలుపునిచ్చింది.

ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతుందని, బీజేపీని నిలదీసేందుకు టీడీపీ రెడీ అయితే  మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమనీ అంటోంది. అసలు పాపం చేసిన వారే ఇప్పుడు న్యాయం చేస్తామని ముందుకొస్తే నమ్మేదెవరంటూ టీడీపీ రిటార్ట్ ఇస్తోంది. మొదట హోదా అని ఆ తర్వాత ప్యాకేజ్ అయినా నిధులు దండిగా ఇస్తే పర్వాలేదని చెప్పిన టీడీపీ చివరకు ప్యాకేజీకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రానికి హోదా రాకపోడానికి ఎంపీలుసరిగా పనిచేయకపోవడమే కారణమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేంద్రాన్ని నిలదీయడానికి ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలీటం లేదన్నారు.
యూపిఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండూ చేసిన మోసానికి ప్రజలు అంతిమంగా బలయ్యారన్నారు..ఇంకోసారి ఆ తప్పు జరగకుండా భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా కచ్చితమైన ఆలోచనా విధానంతో వెళ్తున్నామనీ అందుకు ఇదే తొలిమెట్టు అని పవన్ అన్నారు.

ఏపికి న్యాయం జరగడానికి ఇంకా అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. హోదా తప్ప మరేదీ రాష్ట్ర ప్రజలకు సమ్మతం కాదని మొదట్నుంచీ చెబుతూ వస్తున్న వైసీపీ హోదా కోసం పోరులో ఇతర పార్టీలతో కలుస్తుందా లేదా అన్నది చూడాలి.. మొత్తం మీద హోదా  డిమాండ్ మళ్లీ తెరపైకి వస్తోంది.. మరి ఏపి దాన్ని సాధించుకుంటుందా లేదా అన్నది చూడాలి.


 

Similar News