New films that capture the telangana essence

Update: 2017-09-10 12:44 GMT

హైదరాబాద్‌ః తెలుగు సినిమాల్లో ఇన్నాళ్లు హీరోహీరోయిన్లు ఒకలా, విలన్లు, కమెడియన్లు మరోలా మాట్లాడేవారు. తెలంగాణ యాసను కేవలం విలన్లు, కమెడియన్లు మాత్రమే మాట్లాడతారేమోనన్న భ్రమ కలిగేలా ఒకప్పటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రోజులు మారాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణ యాసకు, తెలంగాణ చిత్రాలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి చిత్రాలకు లభించిన అపూర్వ స్పందనే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు శేఖర్ కమ్ముల చిత్రాలలో అడపాదడపా తెలంగాణ యాస హీరోల నోటి వెంట వినిపించేంది. పెళ్లి చూపులు సినిమా తర్వాత సీన్ మారింది. సినిమాలో విషయం ఉంటే చాలు.. హీరో ఏ యాసలో మాట్లాడితే ఏంటనే భావనకు ప్రేక్షకులొచ్చారు. ఇది నిజంగా మంచి పరిణామం. ఫిదా సినిమాలో హీరోయిన్ నోటి వెంట బాడ్కో వంటి పదం రాకపోతే... ఆ పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడకపోతే సినిమా అంత పెద్ద హిట్ అయ్యుండేది కాదనడంలో అతిశయోక్తి లేదేమో. ఇలా ఏ విధంగా చూసుకున్నా తెలంగాణ దర్శకులు, నిర్మాతలు తెరకెక్కించిన సినిమాలు టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. పెళ్లిచూపులు సినిమా తెలంగాణ యాసతో నేషనల్ అవార్డ్ కైవసం చేసుకుంటే.. ఫిదా సినిమా ఆ యాసలోని ఘాటుతో, మాధుర్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అర్జున్ రెడ్డి తెలుగు సినిమా మూస థోరణికి చరమగీతం పాడుతూ.. సరికొత్త పంథాతో రికార్డ్ హిట్‌గా నిలిచింది. తెలంగాణ సినిమాలు విజయం సాధించడం ఇవాళ కొత్తేమీ కాదు. కానీ విప్లవాల నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు రావడం వల్ల ఉద్యమ సినిమాలుగా వాటిపై ముద్ర పడింది. అలా విజయం సాధించిన సినిమాల్లో మా భూమి(1979), ఒసేయ్ రాములమ్మ(1977), స్వర్ణక్క వంటి సినిమాలు చెప్పుకోదగ్గవి. భాష ఏదైనా, యాస ఏదైనా తెలుగు ప్రేక్షకులు కథా బలం ఉన్న సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఆదరిస్తూనే ఉంటారు. కాకపోతే ఇక నుంచి తెలుగు సినిమా రంగంపై తెలంగాణ దర్శకనిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు కూడా చెరగని ముద్ర వేయనుండటం శుభపరిణామం. ప్రాంతాలు వేరైనా, యాస వేరైనా మనమంతా తెలుగు ప్రజలం, మన తెలుగు భాష.. మన తెలుగు సినిమా అనే సూత్రాన్ని తూచాతప్పకుండా పాటించాలనేది సగటు తెలుగు సినీ ప్రేక్షకుడి అభిలాష.

Similar News