తీవ్ర తుఫానుగా అంపన్.. ఏపీలో భారీ వర్షాలు

మూడు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా రూపాంతరం చెందింది.

Update: 2020-05-17 02:34 GMT

మూడు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారి తర్వాత తుఫానుగా రూపాంతరం చెందింది. నేటి (ఆదివారం) సాయంత్రానికి పెను తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీనికి అంపన్ గా నామకరణం చేసింది. ఆదివారం ఉదయం నుంచి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా 1000 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 1,160 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేరపుపురాకు వాయువ్యంగా 1,220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది.. ఈ తుపాన్ వలన ఏపీలో శనివారం రోజున ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో చెరుకు తోటలు నాశనం అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్లలో పిడుగులు కూడా పడ్డాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక ఇదే అంశంపై క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) శనివారం సమావేశమైంది. తుపాను సన్నద్ధతపై సమీక్షించింది. భారీ వర్షం, బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కమిటీ అంచనా వేసింది.

Tags:    

Similar News