ఏడేళ్ళ బుడతడికి 526 పళ్ళు.. ప్రపంచంలోనే తొలిసారి..

Update: 2019-08-01 04:45 GMT

కొడితే 32 పళ్ళూ రాలిపోతాయి.. కోపంలో తరచూ మనం ఉపయోగించే మాట ఇది. ఎందుకంటే, మనిషికి 32 పళ్ళు ఉండడం సహజం. ఒక్కోసారి కొద్దిగా అటూ, ఇటూగా ఎవరికైనా.. ఎక్కడైనా ఉండొచ్చు. కానీ.. ఈ బుడ్డోడి నుంచి ఏకంగా 526 పళ్ళు పీకారు డాక్టర్లు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదంటూ డాక్టర్లే ముక్కున వేలేసుకుని బోలెడు ఆశ్చర్యపోతున్నారు ఈ దంతాలను చూసి. ఎక్కడో.. ఏమిటో.. తెలుసుకుందామా..

చెన్నై లోని సవీత డెంటల్ కాలేజీ, హాస్పటల్ కు ఓ ఏడేళ్ళ బాబుని తీసుకువచ్చారు తల్లిదండ్రులు. బాబుకి మూడేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచీ క్రింది దవడ భాగంలో కొంత వాపు ఉన్నట్టు గుర్తిచారు. కానీ, పెద్దగా పట్టించుకోలేదు. ఆ వాపు ఇటీవలి కాలంలో ఎక్కువవుతుంటే హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు బాబు అరుదైన ''కాంపౌండ్ కంపోసిట్ ఒండోన్టోమా'' అనే వ్యాధితో బాధపడుతున్నాటు గుర్తించారు.

దీంతో ఆ కుర్రాడి క్రింది దవడకి xరే, సీటీ స్కాన్ చేయించారు. ఈ సందర్భంలో క్రింది దవడ భాగంలో సుమారు 200 గ్రాముల బరువుతో ఉన్న సంచి ఉన్నట్టు గుర్తించారు. దానిని తీసివేయాలని నిర్ణయించారు. సర్జరీ చేసి ఆ సంచి తొలగించిన డాక్టర్లు విస్మయం చెందారు. అందులో మొత్తం 526 చిన్నా, పెద్ద దంతాలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ చేయడానికి వారికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. ఆపరేషన్ తరువాత మూడురోజుల్లో బాలుడు కోలుకున్నాడని వైద్యులు ప్రకటించారు.

ఈ సర్జరీ చేసిన వైద్యుడు సెంథిల్ నాథన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారి ఇటువంటి ఆపరేషన్ జరిగిందనీ, ఇన్ని దంతాలు ఒక వ్యక్తి నుంచి బయటపడటం ఇదే మొదటిసారనీ తెలిపారు.




Tags:    

Similar News