దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్ మమ్మూటి వైఎస్సార్ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైయస్ఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇక కేవలం తెలుగురాష్ట్రాల్లోనే కాక అమెరికాలో సైతం ఈ సినిమాను పెద్దఎత్తున ఆదరిస్తున్నారు. సినిమా ఘనవిజయం సాధించడంతో డల్లాస్ లోని వైయస్ఆర్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఈ మూవీకి మొదటి రోజు భారీగానే కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైయస్ఆర్ ప్రజలకు దూరమై పదేళ్లు గడుస్తున్నా.. నేటికీ అభిమానం తగ్గకపోవడం ఒక గొప్ప విషయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.