నేడు కేసీఆర్‌తో జగన్ భేటీ... రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు..

Update: 2019-05-25 01:16 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల‌ను మించి ఫ్యాన్ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. జగన్‌ జోరుకు అధికార టీడీపీ కొట్టుకుపోయింది. జిల్లాలకు జిల్లాలనే వైసీపీ ఊడ్చేసి, ఊదేసింది. ఫ్యాన్ హోరుకి అధికార టీడీపీతోపాటు జనసేన, ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహణ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంత్రివర్గం ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. నేడు ఉదయం పదిన్నరకు తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. తర్వాత మధ్యాహ్నం జగన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తుంది.

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయనున్న జగన్‌ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. నేడు గవర్నర్‌ను కలవనున్న జగన్‌ రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. అటు ఆదివారం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతోనూ వైఎస్ జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News