తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కథన రంగంలోకి రాహుల్..

Update: 2019-04-01 01:37 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక సమరంలో పట్టు విడవకుండా పోరాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కల ప్రకారం కీలకమైన స్థానాలపై కన్నేసిన టీ కాంగ్రెస్ ఇవాళ అధినేతను మరోసారి ప్రచారం రంగంలోకి దించుతోంది. మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచార సభల్లో పాల్గొంటారు. జహీరాబాద్‌, వనపర్తి‌, హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ అధినేత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

తెలంగాణలో ఐదారు లోక్ సభ స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర సీనియర్ నేతలను తీసుకురావడానికి టీ పీసీసీ ప్లాన్ చేసింది. ముందుగా రాహుల్ గాంధీతో సభలను నిర్వహిస్తోంది. ఇప్పటికే శంషాబాద్‌లో ఒక సభలో పాల్గొన్న రాహుల్ ఇవాళ మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరౌతారు. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్‌, మధ్యాహ్నం 2 గంటలకు వనపర్తి‌, సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్‌లో జరిగే సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు.

ఇవాళ జరిగే రాహుల్‌గాంధీ సభలకు లక్షకుపైగా జనమీకణ చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జహీరాబాద్ లో సభకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. అలాగే వనపర్తిలో నిన్న టీఆర్ఎస్ కేసీఆర్ సభ నిర్వహించింది. రాహుల్‌గాంధీ మరుసటిరోజే వనపర్తికి వస్తుండడంతో అధికార పార్టీ కంటే ఎక్కువగా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న నల్గగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జరిగే హుజూర్ నగర్ సభను కూడా టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పథకం గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్కీం గురించి తెలంగాణ సభల్లో రాహుల్ మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ రాత్రి హైదరాబాద్ చేరుకుని శంషాబాద్ నోవాటెల్ హోటెల్ బస చేశారు. టీపీసీసీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలు , మాజీ మంత్రుల వ్యవహారంపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం.

Similar News