పీఎస్సెల్వీ ప్రయోగం విజయవంతం

Update: 2019-05-22 01:44 GMT

మరో ఘనతను అందుకుంది ఇస్రో. పీఎస్సెల్వీ సి-46 ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 615 కిలోల బరువున్న రీశాట్ 2 బి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రం నుంచి తెల్లవారు జామున 5.30 గంటలకు సీఎస్ఎల్వీ-సీ46 రాకెట్‌ విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో... 48వ PSLV రాకెట్‌ను వాడినట్లైంది. ఇందుకోసం ప్రత్యేకంగా బూస్టర్లు లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే కోర్‌ అలోన్‌ (PSLV-CA) రాకెట్‌ను ఎంచుకుంది. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 14వసారి. ఇందులో నాలుగు దశలున్నాయి. 1, 3 దశల్లో మోటార్లు ఘన ఇంధనంతో, 2, 4 దశల్లోని మోటార్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి. అర్ధరాత్రి ఇంధనం నింపే పని పూర్తి చేశారు. ఆపై ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని పరిశీలించి, ప్రయోగానికి 15 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ అధీనంలోకి తీసుకెళ్లారు.రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్‌-2బీఆర్‌1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను ప్రయోగించింది.



Similar News