టీడీపీపై హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు

Update: 2019-04-17 09:14 GMT

తనను చంపేందుకు కుట్ర జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన కారు చక్రాల బోల్టులు తొలగించి తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. బుధవారం జీవీ హర్షకుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేండ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను టీడీపీ పార్టీ చాలా రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో తనకు అమలాపురం ఎంపీ సీటు కేటాయిస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. అయితే ఇదే విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు విచారణ మాత్రం జరగడం లేదని అన్నారు. ఈ నేపద్యంలోనే పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేలా చూడాలని ద్వివేదిని కోరానని చెప్పారు. ఇక ఇంటర్మీడియట్‌ కాలేజీల్లో అయితే అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని హర్షకుమార్‌ మండిపడ్డారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ అనే పదం ఎక్కడా లేదని, కాలేజీల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఇంటర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హర్షకుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఈనెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.

Similar News