రమణదీక్షితులపై కక్షపూరితంగా వ్యవహరించిందా టీటీడీ?

Update: 2018-05-18 05:40 GMT

టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల సస్పెన్షన్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. తిరుమలలో జరుగుతున్న అగమశాస్త్ర విరుధ్ధ తంతుపై గళమెత్తిన రమణ దీక్షితులుకి అనుకూలంగా కొందరు..వ్యతిరేకంగా మరికొందరు విమర్శలు గుప్పించుకొంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తామని ప్రకటించారు. రమణ దీక్షితులుపై వేటు వేయడంపై ప్రధాన పార్టీలు కూడా విమర్శలు గుప్పించుకొంటున్నాయి. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం తప్పుపట్టారు. చంద్రబాబు హయాంలో పాలనే కాదు ధర్మం కూడా గాడి తప్పుతోందని వ్యాఖ్యానించిన సోము వీర్రాజు..శ్రీవారి ఆభరణాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. 

అటు రమణ దీక్షితులుతో పాటు మరో ముగ్గురు అర్చకులను సస్పెండ్ చేయడాన్ని అర్చక సంఘం తప్పు పట్టింది. నిజాలు మాట్లాడిన వ్యక్తిపై వేటు వేస్తారా అని ప్రశ్నించింది. సస్పెండ్ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోతి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళ తప్పదని హెచ్చరించింది. మరోవైపు టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించిన అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడడం తగదని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. టీటీడీ అర్చకులకు పదవీ విరమణ ప్రకటించడం సరైనది కాదని ట్వీట్ చేశారు. అర్చకులను ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థమే లేదన్నారు..జగన్. వైసీపీ అధికారంలోకొస్తే అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చూస్తామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు.

అయితే తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకుని వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని టీటీడీ పాలక మండలి సభ్యులు డొక్కా జగన్నాధం ఆరోపించారు. పూజలు చేసుకుంటూ కాలం గడపాల్సిన రమణ దీక్షితులు... రాజకీయ పార్టీల నాయకులకు చేతిలో పావుగా మారారని మండిపడ్డారు. ఎలాగూ పదవీ విరమణ చేస్తున్నామనే ఉద్దేశంతో రమణ దీక్షితులు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

Similar News