man held on charge of forging ap minister signature

Update: 2017-09-10 15:08 GMT

ఉద్యోగం కోసం ఓ వ్యక్తి మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేయడం కలకలం రేపింది. అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లో పర్యాటకశాఖలో ఉద్యోగం ఇవ్వాలంటూ అఖిల ప్రియ సిఫారసు చేసినట్లుగా ఆమె సంతకం (ఫోర్జరీ) ఉన్న లేఖ వచ్చినట్లు మంత్రి పేషీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. తన సంతకం ఫోర్జరీ కావడంపై మంత్రి అఖిల ప్రియ స్పందించారు. తన ఛాంబర్‌కు ఓ వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడని, ఆయన తెచ్చిన లెటర్లలో తన సంతకం ఉండడంతో తనకు సందేహం కలిగిందని చెప్పారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించాలనుకునే వాళ్లకు తాను ఎప్పుడూ రెకమెండేషన్ చేయనని, తాను మంత్రినయ్యాక ఎక్కడా అలాంటి సంతకాలు చేయలేదని, తాజాగా ఈ లెటర్లలో తన సంతకం చూసి షాక్ అయ్యానని మంత్రి అఖిల ప్రియ తెలిపారు. ఇదే వ్యక్తి గతంలో నంద్యాల, ఆళ్లగడ్డకు కూడా వచ్చాడని, కానీ తాను సంతకం చేయలేదని అఖిల ప్రియ పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకంతో మోసం చేయాలని చూసిన ఆ వ్యక్తిపై ఎస్పీఎఫ్‌కు ఫిర్యాదు చేసినట్లు మంత్రి అఖిల ప్రియ చెప్పారు.