Revolt RV 400 e-Bike review: రివోల్ట్ ఈ బైక్ ఎలా ఉండబోతోంది?

భారత దేశంలో తొలిసారిగా స్టైలిష్ లుక్ తో రాబోతున్న తొలి ఎలెక్ట్రిక్ బైక్ Revolt RV 400. త్వరలో రోడ్దేక్కబోతున్న ఈ బైక్ ప్రత్యేకతలు ఏమిటి? అసలు కంపెనీ చెబుతున్న విశేషాలలో మంచీ.. చెడూ.. మీకోసం..

Update: 2019-09-02 16:42 GMT

ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ స్కూటర్లనే చూసాం మనం. అదీ చాలా తక్కువగా.. కారణాలు ఏమైనా కానీ, మన దేశ ప్రజలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ను చూస్తే అంతగా ఉత్సాహం అనిపించదు. లుక్ పరంగా కానీ, వేగం విషయంలో కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మన మార్కెట్ లో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. అయితే, ఇప్పుడు తాజాగా Revolt RV 400 మోటార్ బైక్ భారత మార్కెట్లోకి రాబోతోంది. ఎలక్ట్రిక్ విభాగంలో తొలి మోటార్ బైక్ ఇదే. త్వరలోనే రోడ్డు ఎక్కబోతున్న ఈ బైక్ తయారీదారులు అందించిన వివరాల ప్రకారం బైక్ ఎలా ఉండబోతోంది? దానిలో మనల్ని ఆకట్టుకునే అంశాలు ఏమిటి? అసలు ఎలక్ట్రిక్ బైక్ మనకు అనుకూలమా కాదా? ఈ బైక్ లతో మనకు అదనంగా వచ్చే ప్రయోజనమేమిటి? ఈ తొలి బైక్ పూర్తి విశేషాలు మీకోసం..

స్టయిలిష్ లుక్..


Revolt RV 400 యురోపియన్ లుక్ లో కనిపించే ఎలక్ట్రిక్ బైక్. యూకే లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న చైనీస్ సూపర్ సోకో టీఎస్ బైక్ ను ఇది పోలి ఉందనిపిస్తుంది. అది నిజం కూడానూ. ఎందుకంటే, సూపర్ సోకో కంపెనీ రివోల్ట్ ప్లాట్ ఫాం పార్టనర్ గా వ్యవహరిస్తోంది. అందువల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలతో ఎలక్ట్రిక్ బైక్ ని భారత దేశ మార్కెట్లకు అందించ గలుగుతోంది రివోల్ట్.

RV 400 స్లీక్ గా కనిపించే హెడ్ లాంప్ తో వస్తోంది. బ్యాటరీ చుట్టూ గాలి వెళ్లేందుకు వీలుగా వెంటిలేటర్ లాంటి అమరిక ఉంది. ఇది


 బ్యాటరీ తో పాటు ఇతర ఎలక్ట్రిక్ పరికరాల్ని వేడెక్కకుండా కాపాడుతుంది. ఇందులో ఇంధనం దహనమయ్యే ప్రక్రియ ఇంజన్ లో జరగదు కనుక రివోల్ట్ కి ఇంజన్ వద్దచక్కని వెంటిలేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం దొరికింది. ట్యాంక్ పై భాగంలో ఇచ్చిన మూత తో బ్యాటరీని సులువుగా బయటకు తీసుకునే అవకాశం ఉంది. ఇక దీని హ్యాండిల్ విశాలంగా ఉండి సిటీ రోడ్లపై బండి నడిపెటప్పుడు స్టైలిష్ గా కనిపించేందుకు దోహదం చేసేలా ఉంది. అదేవిధంగా సింగిల్ డిటాచబుల్ సీట్ అమరిక చక్కగా కనిపిస్తోంది.

సూపర్ లైటింగ్..

రివోల్ట్ లో అమర్చబడిన ఎల్ఈడీ లైట్ల వ్యవస్థ చక్కని లైటింగ్ ను అందించడం తో బాటు బ్యాటరీని సమర్థవంతంగా ఆదా చేసే విధంగా ఉంది. ఇక స్పీడో మీటర్, ట్రిప్ మీటర్, మైలేజ్ మీటర్, బ్యాటరీ పర్సెంటేజ్ చూపించే మీటర్, ఇంజన్ వేడిని తెలియచేసే మీటర్ చాలా బాగా అమర్చారు. వాటికి ఎల్ఈడీ లైట్ల సపోర్ట్ ను ఇచ్చారు. మొత్తం ఈ హెడ్ లైట్ ఏరియా డీసెంట్ గా ఉంది ఆకట్టుకునే డిజైన్ లో ఉంది.

ఇంధన పొడుపు కోసం తక్కువ బరువు..

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో చెప్పుకోతగ్గ విశేషం దాని బరువు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ బైక్ బరువు 102 కేజీలు వరకూ ఉండొచ్చు. ఇది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే, ఈ బైక్ ఫ్రేమ్ స్టీల్ తో తయారుచేశారు. దానికి అనుసంధానంగా ఉన్న ఫ్రేమ్ లను మాత్రం అల్యూమినియం తో తయారు చేశారు. దీని వలన బైక్ బరువు చాలా వరకూ తగ్గేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ ఆర్వీ బైక్ లో ముందు వైపు ఇన్వర్టెడ్ ఫోర్క్ ఏర్పాటు చేశారు. ఇక వెనుక భాగంలో Benelli TNT 300 మాదిరిగా స్క్రూ ఎడ్జస్ట్ మెంట్ తో కూడిన మోనో షాక్ అబ్జార్బార్ అమర్చారు. ముందు భాగంలో అమర్చిన ఇన్వర్టెడ్ ఫోర్క్ వలన తక్కువ రోలింగ్ రెసిస్టేన్స్ ఉంటుంది. అందువలన తక్కువ ఎనర్జీని బైక్ తీసుకుంటుంది. దీనివలన ఇంధనం ఆదా అవుతుంది.

రెండు వీల్స్ కూ డిస్క్ బ్రేక్ లు..


ఇక బైక్ కు అమర్చిన 8-spoke 17-inch అల్లాయ్ వీల్స్ చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో 90/80 సైజ్ MRF Nylogrip Zapper FY1 టైర్ ను, వెనుక వైపు 120/80 సైజ్ MRF Nylogrip Zapper C. టైర్ ను ఉపయోగించారు. ఇక చెప్పుకోవాల్సింది బ్రేక్. రెండు చక్రాలకూ డిస్క్ బ్రేక్ లు అమర్చారు. ఇంతకు ముందు ఎలక్ట్రిక్ బైక్ లలో డిస్క్ బ్రేక్ లు లేకపోవడమే లోపంగా ఉండేది. భద్రతా కు చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే రీవోక్ లో ఆ ఇబ్బంది లేకుండా చేశారని చెప్పవచ్చు. ఇక బండి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక భద్రత విషయం బాగానే కనిపిస్తున్నప్పటికీ, రోడ్డు మీద టెస్ట్ డ్రైవ్ చేసిన తరువాతే పూర్తీ స్థాయిలో ఆ విషయంలో ఓ అంచనాకు రాగలుగుతాం.


అత్యధిక గరిష్ట వేగం..

రివోక్ చెబుతున్న ప్రకారం RV400 గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ బైక్ విషయంలో ఇది ఎక్కువ వేగంగానే చెప్పొచ్చు. వెనుక వైపు బెల్ట్ ద్వారా చక్రం కదులుతుంది కాబట్టి అది బైక్ నడిపెవారికి చాలా వేగంగా వెళుతున్నట్టు అనిపించవచ్చు. టార్క్ ఎక్కువ ఉన్న అనుభూతి కలిగే అవకాశం ఉంది.


ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా కంపెనీ ఎటువంటి బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు. కానీ, అందిన సమాచారం మేరకు 3.2kW లీథియం అయాన్ బ్యాటరీని వాడినట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ ఒక్కసారి చార్జి చేస్తే 156 కిలోమీటర్ల వరకూ పనిచేస్తుంది. ఇప్పటివరకూ ఏ ఎలక్ట్రిక్ బైక్ కూ ఇటువంటి అవకాశం లేదు. ఇక ఇది సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ మూడు మోడళ్లలో ఈ బైక్ వస్తుంది. సిటీ మోడ్ కంటే.. స్పోర్ట్ మోడ్ లో కొంచెం తక్కువ బ్యాటరీ బ్యాకప్ రావచ్చు. ఎకో మోడ్ తో గరిష్ట బ్యాకప్ ప్రయోజనాలు పొందోచ్చని తెలుస్తోంది.

నాలుగు గంటల్లో చార్జింగ్..

రివోల్ట్ RV 400 బ్యాటరీ చార్జింగ్ కోసం 15amp సాకెట్ అవసరం అవుతుంది. నాలుగు గంటల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. బైక్ తో ఉండగానే బ్యాటరీ చార్జ్ చేసుకోవచ్చు.. లేదా బయటకు తీసి కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఒక్క నిమిషంలో బ్యాటరీని బైక్ నుంచి వేరు చేయవచ్చు. అదేవిధంగా అనుసంధానించవచ్చు.


Tags:    

Similar News