ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు 'పెట్రోల్' మంట.. 2రూపాయలు పెరగనున్న పెట్రోల్, డీజిల్!

Update: 2020-01-30 03:56 GMT

ఒకపక్క రకరకాల సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న జగన్ ప్రభుత్వం మరోపక్క షాక్ లు కూడా ఇస్తోంది. ఆ మధ్య మందు బాబులకు ధరల షాకిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజాగా వాహనదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2 రూపాయలు పెరగనున్న పెట్రోల్..

ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్‌పై ఇప్పటి వరకూ 31 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా.. దాన్ని 35.20 శాతానికి పెంచారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా దాన్ని 27 శాతానికి పెంచారు. ఇప్పటికే రోజూ మారుతున్న పెట్రోల్ ధరలు ఇటీవలి కాలంలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏపీ సర్కారు పన్ను పెంపు నిర్ణయంతో మరింత భారంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారనున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు 2018 సెప్టెంబర్ నెలలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో 2 రూపాయల మేర పన్నులను పెట్రోల్, డీజిల్ పై తగ్గించారు. ఇప్పుడు దాదాపు 16 నెలల తరువాత అదేమేర పన్నులను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా జగన్ పాలన ముందుకు వెళుతోంది. అయితే, ఓవైపు ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, మరోవైపు అప్పుల భారం ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా పరిణమించాయి. ఆదాయం పెంచుకోక తప్పని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఏర్పడింది. దీంతో పెట్రోల్ ధరల పై పన్నులను పెంచారు. ఈ పెంపుదలతో విజయవాడలో పెట్రోల్ ధర దాదాపు ముంబాయి పెట్రోల్ ధరలకు దగ్గరగా చేరనుంది. 

Tags:    

Similar News