Ganesh Nimajjanam: నేడు భాగ్యనగరంలో వినాయక నిమజ్జనోత్సవం

Police Special Focus On Security Over Ganesh Nimajjanam in Hyderabad
x

Ganesh Nimajjanam: నేడు భాగ్యనగరంలో వినాయక నిమజ్జనోత్సవం

Highlights

Ganesh Nimajjanam: మూడు కమిషనరేట్‌‌ల పరిధిలో నిమజ్జనాలకు ఏర్పాట్లు

Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జన వేడుకలకు భాగ్యనగరం సర్వం సిద్దమైంది. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ముగింపు ఉత్సావాలకు కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు నూతన టెక్నాలజీ వినియోగించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది రాష్ట్ర పోలీస్ శాఖ. మొత్తం మూడు కమిషనరేట్లలో జరిగే నిమజ్జానానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ముంగింపు ఉత్సవ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు కోరారు.

ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి దాదాపు 60 వేల మండపాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమజ్జన వేడుకలకు 25 వేల మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలోనే దాదాపు 12వేల మంది పోలీసులు గస్తీ ఉంటుందని అధికారులు తెలిపారు. నిమజ్జనానికి ప్రత్యేకంగా గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంచారు.

ఇక గణేష్ విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌ వద్ద 30కి పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో 12 క్రేన్లు, ట్యాంక్‌బండ్‌ వద్ద 10 క్రేన్లు అమర్చారు. మినిస్టర్‌ రోడ్‌ వద్ద 3 లేదా నాలుగు, రాజన్న బౌలి వద్ద 3, మీరాలం ట్యాంక్‌ వద్ద 2, ఎర్రకుంట వద్ద 2 క్రేన్లు అందుబాటులో ఉంటాయి. గతేడాది నుంచి ప్రవేశపెట్టిన ప్రత్యేక రిలీజ్‌ హుక్‌లు 160 అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల నిమజ్జనం త్వరగా పూర్తవుతుంది. ఈ ఏడాది సాగర్‌లో 30 వేల నుంచి 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి సిబ్బంది, క్రేన్లు అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మండపం పై నుంచి వెళ్లే కరెంట్‌ తీగలు, హైటెన్షన్‌ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

పోలీసులు ముఖ్యంగా బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు 18 కిలోమీటర్ల ప్రధాన దారితో పాటు సబ్‌ రోడ్లపై అధికంగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో మొత్తం 120 కిలోమీటర్ల దారిలో విగ్రహాలు నిమజ్జనానికి రానున్న నేపధ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. వినాయక శోభయాత్ర కొనసాగే రూట్లలో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని, మొత్తం 30 గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ శోభాయాత్ర జరిగే 17 ప్రధాన రహదారుల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ యాత్రలో 10 వేల లారీలు పాల్గొనే అవకాశం ఉందని రంగనాథ్ తెలిపారు.

అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో నిఘా, రూఫ్‌టాప్‌ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్‌ ఏరియాలు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్‌ టవర్లతో పాటు కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్‌ చేసుకుంటున్నారు. అవసరమైన, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ సెలవులు రద్దు చేశారు. స్టాండ్ టూ స్టే ని ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories