Keesara Tahsildar Case Updates: కీలక మలుపులు తిరుగుతున్న కీసర భూ బాగోతం..

Keesara Tahsildar Case Updates: కీలక మలుపులు తిరుగుతున్న కీసర భూ బాగోతం..
x
Highlights

Keesara Tahsildar Case Updates: గిన్నీస్ బుక్ సంచలనాలకే దారితీసిన కీసర భూ బాగోతం కీలకమైన మలుపులు తిరుగుతోంది.

Keesara Tahsildar Case Updates: గిన్నీస్ బుక్ సంచలనాలకే దారితీసిన కీసర భూ బాగోతం కీలకమైన మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు తహశీల్దారు, వీఆర్వో ప్రమేయమే అనుకున్న ఏసీబీకి కొత్తగా మరో ఇద్దరి అధికార్ల పేర్లు తెరమీదకు వచ్చాయి. తహశీల్దారు నాగరాజు చెప్పిన ప్రకారం ఆర్డీవో, కలెక్టర్లు చెప్పిన మీదటే తాను అక్కడకు వెళ్లానని స్పష్టం చేశాడు. దీంతో పాటు మరికొంత మంది అధికార్ల పేర్లకు నాగరాజు వెల్లడించారు.

కీసర భూ బాగోతం ఊహించని మలుపు తిరిగింది. ఈ వ్యవహా రంలో తాను మేడ్చల్‌ జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే శ్రీనాథ్, అంజిరెడ్డిలను కలిసేందుకు వెళ్లానని, అదే సమయంలో ఏసీబీ దాడి జరిగిందని కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ విచారణలో వెల్లడించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. గురువారం ఏసీబీ న్యాయస్థానానికి అందజేసిన నిందితుల నేరాంగీకారపత్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పలు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మొత్తం కేసులో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్, ఆర్డీవో రవి, హన్మకొండ తహసీల్దార్‌ కిరణ్‌ ప్రకాశ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తహసీల్దార్‌ నాగరాజు, ఏ2 వీఆర్‌ఏ సాయిరాజు, ఏ3 శ్రీనాథ్‌యాదవ్, ఏ4 అంజిరెడ్డిలతోపాటు ఇటీవల ఏసీబీ కస్టడీలో అనేకమంది అధికారుల పేర్లు వెల్లడించారు.

నాగరాజు ఏమని చెప్పాడంటే..

విచారణలో నాగరాజు ఏసీబీ అధికారులకు అస్సలు సహకరించలేదు. పలు కీలక ప్రశ్నలకు ఆయన మౌనం వహించాడు. అయితే శ్రీనాథ్, అంజిరెడ్డిల నుంచి లంచం తీసుకునే విషయమై నాగరాజు సంచలన విషయాలు వెల్లడించాడు. తాను మేడ్చల్‌ కలెక్టర్, ఆర్డీవో రవి ఆదేశాల మేరకే భూవివాదంపై చర్చించడానికి అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను కలిసేందుకు కాప్రా వెళ్లానని స్పష్టం చేశాడు. అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్‌లకు ఈ వివాదాస్పద భూమితో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదన్నాడు. వాస్తవానికి శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూవివాదం తన పరిధిలో లేనేలేదని చెప్పాడు.

శ్రీనాథ్‌ వివరణ ఇదీ..

ఏ3 నిందితుడు రియల్టర్‌ శ్రీనాథ్‌ యాదవ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాంపల్లి దయారాలోనే సర్వే నంబర్‌ 614లోని 61 ఎకరాల 20 గుంటల వివాదాస్పద భూమి గురించి తనకు కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇక్బాల్‌ ద్వారా తెలిసిందని శ్రీనాథ్‌ చెప్పాడు. తాను అంజిరెడ్డిని, అతని సోదరుడు హన్మంతరెడ్డి ద్వారా కలిశానన్నాడు. దాంతో భూమి పొజిషల్‌లో ఉన్న పట్టాదారులు, ముస్లింలతో ఇక్బాల్‌ ద్వారా, గ్రామస్తులను అంజిరెడ్డి సాయంతో అనేక సార్లు సమావేశమయ్యానన్నారు. చివరికి ఈ భూ వివాదంపై తాను సూచించిన పరిష్కారానికి వారంతా అంగీకరించారన్నాడు. ఇందులో భాగంగానే ఈ భూమికి సంబంధించి మొయినుద్దీన్‌ గాలిబ్‌ మరో 37 మంది ద్వారా తన పేరిట జీపీఏ చేయించినట్లు వివరించాడు.

నగదును ఎలా సేకరించావన్న ప్రశ్నకు శ్రీనాథ్‌ బదులిస్తూ.. ఆగస్టు 14న తాము తన స్నేహితుడు యుగంధర్‌తో కలిసి తన కారులో కాజీపేట వెళ్లామని పేర్కొన్నాడు. మొత్తం రూ.కోటీ పది లక్షలను తన స్నేహితుడైన ముడిదె తేజేశ్వర్‌ ఏర్పాటు చేశాడన్నారు. తేజేశ్వర్‌ సూచన మేరకు తాము రూ.70 లక్షలను వరంగల్‌ బస్టాండ్‌ సమీపంలోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి తీసుకున్నామన్నారు. దేవీ థియేటర్‌ వెనక భాగంలో రూ.30 లక్షలు, మరో రూ.10 లక్షలను రత్నం రాజిరెడ్డి, ఆర్‌ఎల్‌ రవి నుంచి అంబేడ్కర్‌ భవన్‌ వద్ద తీసుకున్నామన్నాడు. డబ్బును కారు డిక్కీలో పెట్టుకుని రాత్రి 7.30 గంటలకు కాప్రా ఆరుల్‌నగర్‌లోని అంజిరెడ్డి ఇంటికి చేరుకున్నామని చెప్పాడు.

తహసీల్దార్‌ నాగరాజుతో పరిచయం ఎలా జరిగింది అన్న ప్రశ్నకు.. ఈ ఏడాది మార్చిలో తన మిత్రుడు, హన్మకొండ తహసీల్దార్‌ అయిన కిరణ్‌ ప్రకాశ్‌ ద్వారా కీసర ఆర్డీవో రవి పరిచయమయ్యాడని, ఆయన ద్వారా నాగరాజును ఆశ్రయించానని చెప్పాడు. ఈ పనికి నాగరాజును పురమాయించేందుకు ఆర్డీవోకి ఏమైనా లంచం ఇచ్చావా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్‌ నోరు మెదపలేదు. అదే విధంగా ఈ వ్యవహారం పరిష్కరించేందుకు, మ్యుటేషన్‌ ఇంకా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ కోసం నాగరాజుకు, వీఆర్‌ఏ సాయిరాజుకు అంజిరెడ్డి ఇంట్లో ఏమైనా డబ్బులు చెల్లించారా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్‌ సమాధానం చెప్పలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories