KCR: రాజ్యసభ స్థానాలపై కేసీఆర్ ఫోకస్

KCR Focus on Rajya Sabha Seats | Telangana News
x

KCR: రాజ్యసభ స్థానాలపై కేసీఆర్ ఫోకస్ 

Highlights

KCR: పలువురి పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్

KCR: రాజ్యసభ స్థానాలపై గులాబీ అధినేత కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బండ ప్రకాష్ తో ఖాళీ అయిన స్థానాన్ని ఈనెల 18న ప్రకటించనున్నారు గులాబీ బాస్. దీనితోపాటు మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆశావాహుల లిస్ట్ అధినేత వద్దకు చేరడంతో ఎవరికి అవకాశం ఇస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఖాళీ కాగా మరో రెండు స్థానాలు వచ్చే నెల 21న ముగియనున్నాయి. ఇప్పటికే రాజ్యసభ కు రాజీనామా చేసి ఎమ్మెల్సీ గా గెలుపొందిన బండ ప్రకాష్ ముదిరాజ్ తో పాటు వచ్చే నెలలో ఖాళీ కానున్న రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండగా, మూడు నెలల క్రితం శాసనమండలికి నామినేట్ అయిన ఎంపీ బండా ప్రకాష్ రాజీనామా చేయడంతో ఒక సీటు ఖాళీగా ఉంది. అయితే వీటిని ఆయా సామాజిక వర్గాల ప్రాతిపదికన అభ్యర్థులను నియమించాలని భావిస్తున్నారు కేసీఆర్. ఒక దళిత నేతతో పాటు మరో బీసీ నేతకు , ఓసీ అభ్యర్థితో పాటు పార్టీలోని మరికొంత మంది పేర్లను పరిశీలిస్తున్నారు సీఎం.

దాదాపు 18 రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే ఉన్న సీఎం ప్రగతి భవన్ కి చేరుకున్నారు. మంగళవారం మరోసారి అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఈనెల 18 న గులాబీ బాస్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రగతి భవన్ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. వీటితో పాటు మరో రెండు స్థానాలకు గాను ఒక ఎస్సి , ఒక ఓసి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బండ ప్రకాష్ స్థానానికి ఓ పత్రిక లో సీఎండి గా పనిచేసిన దామోదర్ రావు పేరు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. కమలం పార్టీ దిగి కారెక్కిన దళిత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును కేసీఆర్‌ పెద్దల సభకు పంపే అవకాశాలున్నట్లు పార్టీ లో జోరుగా చర్చ జరుగుతుంది.

ఇక బీజేపీ విధానాలను మోడీని తీవ్ర స్థాయిలో విమర్శించే నటుడు ప్రకాష్ రాజ్ కు కేసీఆర్ రాజ్యసభ ఇస్తారనే చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో ప్రకాష్ రాజ్ కు పరిచయాలు ఉండటం నటుడు కావడంతో పెద్దల సభలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాయిస్ ఉంటుందని సీఎం భావిస్తున్నారు.ఇటీవలె ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధిత ఉప ఎన్నికల షెడ్యూల్ ఈనెల 19 నామినేషన్లకు చివరి తేదీ కానుండగా ఆలోగా అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇక కెప్టెన్ లక్ష్మీ కాంత రావు,డి.శ్రీనివాస్ ల స్థానాలకు సైతం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.దానిలో భాగంగా ఈనెల 24 నుండి 31 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండటంతో ఆ స్థానాలపై సీరియస్ గా దృష్టి సారించారు కేసీఆర్.

జాతీయ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్న మాజీ ఎంపీ ప్రస్తుత ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ ని రాజ్యసభకు పంపుతారనే చర్చ కూడా ఉంది. ఇక ఖమ్మం జిల్లా నుండి మాజీ ఎంపీ కేటీఆర్ కు మిత్రుడు పొంగులేటి శ్రీ నివాస్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే అధికార పార్టీకి కొద్దిరోజులుగా అంటిముట్టనట్లుగా ఉంటున్న పొంగులేటి కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మెన్ ఎంఏ సలీమ్ ల పేర్లు కూడా సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజ్యసభ లో తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపించే వారిని రాజ్యసభ కి పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఇతర రాష్ట్రాల నేతలతో పరిచయాలు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. ఈసారి అధినేత పెద్దల సభ కి ఎవరిని పంపుతారనేది ఆసక్తి రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories