Temple Visits: ఆలయాలకు పరుగులు పెడుతున్న చైనీయులు.. ఎందుకంటే?

Young People of China Temple Visits Increasing
x

Temple Visits: ఆలయాలకు పరుగులు పెడుతున్న చైనీయులు.. ఎందుకంటే?

Highlights

Temple Visits: డ్రాగన్‌ కంట్రీ.. ఎర్ర జెండాను భుజానికి ఎత్తుకుంది.

Temple Visits: డ్రాగన్‌ కంట్రీ.. ఎర్ర జెండాను భుజానికి ఎత్తుకుంది. ప్రపంచానికి కమ్యూనిస్టు పాఠాలు చెబుతోంది. నాస్తికవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా దేవుడే లేడంటూ చైనా కామ్రేడ్లు వాదిస్తుంటారు. మతాల ప్రతిపదికన ఎలాంటి కార్యక్రమాలకు నిర్వహించదు. కానీ.. ఇప్పుడు ఈ దేశంలో నాస్తికుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు యువ చైనీయులు టెంపుల్‌ రన్ చేపడుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి చైనాలోని బౌద్ద, టావో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. బీజింగ్‌లోని లామా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం 40వేల మంది ఈ యాంగీ ప్యాలెస్‌ను దర్శించుకుంటున్నారు. వారిలో సగానికి పైగా యువ చైనీయలు ఉంటున్నారు. నాస్తికులు, కమ్యూనిజాన్ని వంటబట్టించుకున్నవారు ఇప్పుడు పూజా కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. అసలు చైనీయులకు ఏమైంది? ఎందుకు ఆలయాలకు పోటెత్తుతున్నారు?

పరీక్షలు.. ఈ మాట వింటే చాలా మందికి భయం కలుగుతుంది. పరీక్షలకు ముందు నుంచీ సిద్ధమై ఉంటే ఓకే.. లేదంటే మాత్రం పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు కనిపించిన దేవుళ్లందరికీ మొక్కుతారు. పరీక్షల గండం నుంచి గట్టెక్కించాలంటూ వేడుకుంటారు. సాధారణంగా.. మన దగ్గర పరీక్షల సమయంలో ఎవరో విద్యార్థి మాత్రమే ఇలాంటివారు కనిపిస్తారు. కానీ.. చైనీయులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీ యువత ఆలయాల వైపు పరుగులు పెడుతోంది. ఉన్నట్టుండి చైనీయల్లో దైవ భక్తి పెరిగిపోయింది. ఆలయాల్లో భారీగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఇది అపరాధ భావమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రస్తుతం చైనీయులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో అతి పెద్ద సమస్య మాత్రం ఆర్థిక వృద్ధి మందగించడమేనని తెలుస్తోంది. దీని కారణంగా.. పలు కంపెనీలు మూత పడ్డాయి. ఉత్పత్తి తగ్గి పోయింది. ఆదాయం పడిపోయింది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. మూడేళ్లుగా కరోనాతో తీవ్రంగా పోరాడిన డ్రాగన్‌ కంట్రీలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది డిగ్రీలను పూర్తి చేసుకున్నారు. ఉద్యోగాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే యువత నిరుద్యోగ రేటు 18 శాతానికి పైగా పెరిగింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. మూడేళ్లు ఇళ్లకే పరిమితమవడం.. ఉపాధి లేకపోవడంతో సహజంగా యువ చైనీయుల మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. కష్టాలు లేకపోతే.. దేవుడిని ఎవరూ గుర్తించుకోరు. కానీ.. సమస్యలు అధికమైతే మాత్రం దేవుడు తప్పకుండా గుర్తొస్తాడు. తమ కష్టాలను తీర్చే దేవుళ్ల కోసం వెతుకుతారు. ఫలానా ఆలయంలో సందర్శిస్తే మంచి జరుగుతుందని ఎవరు చెప్పినా వెళ్లిపోతారు. తమ కష్టాలను తీర్చమని ఆయా దేవుళ్లను వేడుకుంటారు. ఇప్పుడు చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చైనా యువతలో అస్తిత్వ ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆలయాలకు పరుగులు పెడుతున్నారు. ఏ ఆలయం చూసినా.. రద్దీగానే కనిపిస్తోంది. కానీ మతాలు, పూజల విషయంలో చైనా ప్రత్యేకమైన కేసు. ఎందుకంటే.. చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ.. అధికారికంగా నాస్తికవాదాన్ని పాటిస్తోంది. చైనా కామ్రెడ్ల లెక్కల ప్రకారం.. దేవుడంటే.. వ్యక్తిత్వం లేని వాడు. చైనా ప్రభుత్వం కేవలం బుద్దిజం, టావోజం, ఇస్లామ్‌, కేథలిజం, ప్రొటెస్టాంటిజంను మాత్రమే అధికారికంగా మతాలుగా గుర్తించింది. కానీ.. ప్రపంచంలో మతపరమైన విధానాలను అతి తక్కువగా అనుసరించే దేశాల్లో చైనా ఒకటి. కమ్యూనిస్టు దేశంలో ఏ మతాన్ని ఇష్టపడని నాస్తికులు 100 కోట్ల మంది మేర ఉన్నారు. అలాంటిది సంక్షోభ సమయంలో చైనీయులు దేవుడిని ఆశ్రయించడం సాధారణ విషయం ఏ మాత్రం కాదు. చైనీయుల్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది? అంటే... డిసెంబరులో జీరో కోవిడ్‌ పాలసీని బీజింగ్‌ ఎత్తి వేసింది. కఠినమైన కోవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగించింది. ఆ తరువాత నుంచి బుద్ధిస్టులు, టావోయిస్టులు ఇప్పుడు ఆలయాలకు భారీగా తరలి వస్తున్నారు. ప్రత్యేకించి ఆలయాలకు వచ్చేవారిలో యువతే అధికంగా ఉంటోంది. నిజానికి కోవిడ్‌ తరువాత.. ప్రపంచ వ్యాప్తంగా ఆలయాల సందర్శన మునపటిలా మాత్రం లేదు. కానీ.. చైనాలో మాత్రం రివర్స్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.

కఠినమైన కోవిడ్‌ లాక్‌డౌన్‌తో చాలా మంది చైనీయులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా ఇప్పుడు ఓదార్పు కోసం ఆలయాలకు క్యూ కడుతున్నారు. దీంతో డ్రాగన్‌ కంట్రీలోని ఆలయాల్లో సాంస్కృతిక, పూజా కార్యక్రమాలు భారీగా ట్రెండ్‌ అవుతున్నాయి. రాజధాని బీజింగ్‌లోని లామా ఆలయంగా పేరున్న యాంగీ ప్యాలెస్‌ యువ చైనీయులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి టెబెటన్‌ బుద్దిస్టు ఆలయమని కూడా అంటారు. దేశంలోనే అత్యధికంగా భక్తుల సందర్శిస్తున్న ఆలయంగా యాంగీ ప్యాలెస్‌ రికార్డులకెక్కింది. లామా టెంపుల్‌కు నిత్యం 40వేల మంది సందర్శిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్‌ మార్చి నుంచి మొదలైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆలయానికి మాత్రమే చైనీయులు వస్తున్నారనుకుంటే పొరపాటే. గతేడాదితో పోలిస్తే.. దేశంలోని ఆలయాలన్నింటిలోనూ భక్తుల తాకిడి 300 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమటంటే.. ఆలయాలను సందర్శిస్తున్నవారిలో సగానికి పైగా యువతే ఉన్నారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. వారంతా నాస్తిక భావాలు, కమ్యూనిజంను నరనరా జీర్ణించుకున్న వాళ్లే కావడం విశేషం. అంటే స్పష్టంగా... మతంతో సంబంధం లేకుండా.. యవత ఆలయాలకు పరుగులు పెడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఆదే సమయంలో ఆలయాలు ఇప్పుడు యువతను ఆకర్షిస్తున్నాయి. కొందరు ఆలయాల ప్రాంగణాల్లో కొత్త తరహా కాఫీ షాపులను తెరిచారు. ఉద్యోగాలు దొరకలేదని బాధపడకుండా.. స్వయం ఉపాధికి సిద్ధమవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం మెటావర్సివ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా.. భక్తిలో లీనమయ్యే అనుభూతులను అందిస్తున్నారు. ఇంకొందరు యువత మాత్రం సన్యాసులుగా మారాలని యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనా సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైన యువత.. అందుకు విరుడుగా మతం వైపు మల్లుతున్నారు. సమస్యల నుంచి బయటపడడానికి మతమే సురక్షితమైన మార్గంగా యువ చైనీయులు భావిస్తున్నారు. ఉపాధి లేని చైనా పెద్దలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిన్‌పింగ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వారిని తీవ్ర నిరాశ పరుస్తున్నాయి. తమను బీజింగ్ ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నారు. దేవుడిని బహిరంగంగా నిరాకరించిన డ్రాగన్‌ కంట్రీ.. ఇప్పుడు కళ్లు తెరుచుకుంది. ప్రజలంతా ఆలయాల వైపు పరుగులు పెడుతుండడంతో.. దేవుడిని చట్టబద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇక యువతకు కూడా భక్తి మార్గంలో నడుస్తున్నారు. అయితే అక్కడి మీడియా మాత్రం తాజా ట్రెండ్‌పై మండిపడుతోంది. దేవతల గురించి ప్రచారం చేసే బదులు.. తమ ఉద్యోగాల్లో మరింత కష్టపడి పని చేయాలని సూచిస్తోంది. కొందరు బౌద్ధ గురువులు.. ఆలయాల వద్ద తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అరోపించింది. అయితే మీడియా కథనాలను మాత్రం చైనీయులు పట్టించుకోవడం లేదు. ఆలయాలకు భారీగానే తరలి వెళ్తున్నారు. అయితే చైనీయులు కేవలం మానసిక ప్రశాంతత కోసమే ఈ దారిని ఎంచుకున్నారు,. ఆధునిక జీవిత పోరాటంలో యవతకు అదే కవచంలా కనిపిస్తోంది. అందుకే ఉద్యోగాలు లేని చైనాలో టెంపు‌ల్‌ రన్ కొనసాగే అవకాశం ఉంది. తాజా ఆలయాల రద్దీ, యువత దైవ చింతనపై బీజింగ్‌ సైతం నిశితంగా పరిశీలిస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే విషయంపై తీవ్రంగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా చైనా ఆర్థిక వ్యవస్థ క్రుంగుబాటు.. ఆ దేశ యువతను ఆలోచనల్లో పడేసింది. నిరుద్యోగంతో పెరుగుతున్న ఒత్తిడిని అదుపు చేసుకునేందుకు దైవ మార్గాన్ని అనుసరిస్తున్నారు. అసలు దేవుడిని నమ్మని వారు కూడా ఆలయాల్లో ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. భారీగా ఆలయాలకు తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories