Pakistan: టీ తాగడంపైనా పాక్‌లో నిషేధం.. రోజుకు రెండు కప్పులు తాగండి చాలంటూ..

People in Pakistan Urged to Drink Fewer Cups of Tea | Pakistan News
x

Pakistan: టీ తాగడంపైనా పాక్‌లో నిషేధం.. రోజుకు రెండు కప్పులు తాగండి చాలంటూ..

Highlights

Pakistan: టీ తాగడం ఆపేస్తే.. సంక్షోభం నుంచి గట్టెక్కుతామా?

Pakistan: పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రోజురోజుకు విదేశీ మారక నిధులు తరుగుతుండడంతో షెహబాజ్‌ ప్రభుత్వం కొత్త కొత్త ఆంక్షలను విధిస్తోంది. నిన్న మొన్నటివరకు రాత్రి 8.30గంటలకే దుకాణాలను మూసేయాలని.. పది గంటల తరువాత పెళ్లి వేడుకలను నిషేధించింది. ఇప్పుడు టీను తాగించడం తగ్గించండంటూ ప్రభుత్వం కోరడం.. అక్కడి ఆర్థిక విషమ పరిస్థితులకు అద్దం పడుతోంది. తాజా టీ తాగడం తగ్గించాలని కోరడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ చోద్యమంటూ నిలదీస్తున్నారు. టీ తాగడం ఆపేస్తే.. ఆర్థిక సంక్సోభం నుంచి గట్టెక్కుతామా? అంటూ పాకిస్థానీయులు ప్రశ్నిస్తున్నారు.

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు టీ తాగడం తగ్గించుకోవాలని పాకిస్థాన్‌ సీనియర్‌ మంత్రి అహ్సాన్‌ ఇగ్బాల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోజుకు ఒకటి, రెండు కప్పులు టీ తాగడంతో దిగుమతుల బిల్లులను తగ్గించుకోవచ్చని మంత్రి చెప్పారు. దీంతో పాకిస్థాన్‌ విన్నపాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే మంత్రి విన్నపంపై పాకిస్థాన్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ తాగకుండా.. పాకిస్థానీయులకు పూట గడవదు. అలాంటిది టీని తగ్గించుకోమని చెప్పేసరికి ఆగ్రహం వ్యక్తమవుతోంది. పేదల నుంచి ధనికుల వరకు నిత్యం టీ తాగిన తరువాతే.. తమ రోజువారి పనులను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ తాగడం ఆపేస్తే.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామా? అంటూ నిలదీస్తున్నారు. ఇదేమి చోద్యమని పాకిస్థానీయులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రపంచంలోనే తేయాకు ఉత్పత్తులను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం పాకిస్థానే.. ఏటా తేయాకు ఉత్పత్తుల కోసం 60కోట్ల డాలర్లను పాకిస్థాన్‌ వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌ మంత్రి అహ్సాన్‌ ఇగ్బాల్‌ ప్రజలకు విన్నవించారు.

ఇటీవలే పాక్‌ మార్కెట్లను రాత్రి 8.30 గంటలకే మూసేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల తరువాత పెళ్లి వేడుకలను నిషేధించింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని పాక్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో నిత్యం 26వేల మెగా వాట్ల విద్యుత్ అవసరం. అయితే ఉత్పత్తి అవుతున్నది మాత్రం 22వేల మెగావాట్ల విద్యుత్తే. 4వేల మెగా వాట్ల విద్యుత్ లోటు నెలకొన్నది. దీంతో విద్యుత్‌ కొరత నివారణకు దేశ వ్యాప్తంగా 2 గంటల కోతను కూడా విధించింది. విద్యుత్‌ ఉత్పత్తి పడిపోవడానికి బొగ్గు కొరతే ప్రధాన కారణం. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి పడిపోవడం.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పాక్‌ విలవిలాడుతోంది. కొత్తగా బొగ్గు కొనుగోలు చేసేందుకు నిధులు లేక.. ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. మరోవైపు చమురు కొరత ముంచుకొస్తోంది. చమురును కూడా ఆదా చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు నాలుగు రోజులే పని దినాలను కల్పించింది. దీంతో మూడ్రోజుల పాటు ఇంధనం ఆదా అవుతోందని షెహబాజ్‌ సర్కారు భావిస్తోంది.

పాకిస్థాన్‌ వద్ద ఉన్న విదేశీ మారక నిధులు పడిపోతున్నాయి. పిబ్రవరిలో 16 వందల కోట్ల డాలర్లు ఉన్న విదేశీ నిధులు.. ప్రస్తుతం వెయ్యి కోట్ల దిగువకు పడిపోయాయి. దీంతో క్రమంగా షెహబాజ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సాధ్యమైనంత మేరకు విదేశీ మారకాన్ని కాపాడుకునేందుకు పాకిస్థాన్‌ యత్నస్తోంది. అందులో భాగంగా ఆర్థిక ఆంక్షలను షెహబాజ్‌ ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. దిగుమతుల్లో డజనకు పైగా లగ్జరీ వస్తువులను నిషేధించింది. రుణాల కోసం తీవ్రంగా యత్నిస్తోంది. అప్పులు ఇచ్చేందుకు చైనా, గల్ఫ్‌ దేశాలు ముఖం చాటేశాయి. గత్యంతరం లేక అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్‌ ఆశ్రయించింది. ఐఎంఎఫ్‌ సూచనల మేరకు క్రమంగా చమురు ధరలను బాదుతోంది. తాజాగా మరోసారి లీటరు పెట్రోలుపై 24 రూపాయలు, డీజిల్‌పై 59 రూపాయలను పెంచింది. దీంతో లీటరు పెట్రోలు ధర 234 రూపాయలకు, డీజిల్‌ ధర 263 రూపాయలకు చేరింది.

పెరుగుతున్న ధరలు, ఆర్థిక ఆంక్షలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఇంతకంటే దారుణ పరిస్థితులను పాకిస్థాన్‌ ప్రజలు అనుభవించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను చూసి విస్తుపోతున్నారు. పరిస్థితిని బాగుచేస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి దింపేసి అధికారం చేపట్టి షెహబాజ్‌ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. టీ కూడా తాగొద్దంటే ఎలా? అంటూ మండిపడుతున్నారు. పెట్రోలు ధరలు విపరీతంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక మాదిరిగా ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే శ్రీలంకలోని పరిణమాలు తప్పవంటున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్న 900 కోట్ల డాలర్ల విదేశీ నిధులు 40 రోజుల పాటు వచ్చే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ కూడా నిధులు ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకు అసలు కారణం చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడర్‌-సీపెక్‌. పాకిస్థాన్‌ తీసుకున్న అప్పుల్లో సీపెక్‌కు చెల్లించడానికే అధికంగా పోతున్నాయి. ఈ నేపథ్యంల సీపెక్‌ చెల్లింపులు ఆపేయాలని ఐఎంఎఫ్ కోరుతోంది. పాక్‌ ప్రభుత్వానికి అందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో రుణ దారులు కూడా మూసుకుపోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories