Kuwait King: అనారోగ్యంతో కువైట్‌ రాజు షేక్‌ నవాఫ్‌ కన్నుమూత

Kuwait King Kuwaits Ruling Emir Sheikh Nawaf Al Ahmad Al Sabah Dies At Age 86
x

Kuwait King: అనారోగ్యంతో కువైట్‌ రాజు షేక్‌ నవాఫ్‌ కన్నుమూత

Highlights

Kuwait King: కువైట్‌ను కట్టెక్కించిన నవాఫ్ అల్‌ అహ్మద్‌ అల్‌

Kuwait King: కువైట్ రాజు షేక్ నవాఫ్ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కువైట్ రాజుకు గౌరవ సూచకంగా భారత్ జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. తమ దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడిన నవాఫ్ అల్ స‌బా మ‌ర‌ణంతో కువైట్ ప్రజ‌లు క‌న్నీరుమున్నీరవుతున్నారు. కరోనా సమయంలో 2020లో చమురు ధరల పతనంతో కువైట్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది.

దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు రాజు అల్ సబా అనేక చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను ఇచ్చాయి. కేవలం మూడేళ్లే రాజుగా ఉన్నా.. కువైట్ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుత రాజు నవాఫ్ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా కన్నుమూయడంతో ఆయన సవతి సోదరుడు, యువరాజు షేక్‌ మిషల్ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా.. కువైట్ రాజు అయ్యారు. ఈ విషయాన్ని కువైట్ స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. ప్రస్తుతం షేక్‌ మిషల్‌ వయసు 83 ఏళ్లు.

మిడిల్ ఈస్ట్‌లో అత్యంత ధనిక, చమురు సంపన్నమైన కువైట్.. ఒక సంప్రదాయపరమైన దేశం. అధికారం మొత్తం అల్‌ సబా కుటుంబం చేతిలోనే ఉంటుంది. అది అత్యంత పవర్‌ ఫుల్‌. 2006లో నాటి కువైట్ పాలకుడు షేక్ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ సబా.. షేక్ నవాఫ్‌ను యువరాజుగా ప్రకటించారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా కన్నుమూయడంతో.. నవాఫ్ అల్ సభా కువైట్ రాజు అయ్యారు.

నవాఫ్ అల్ సభా కిందటి నెలలో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. రాజు అత్యవసర ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారని రాయల్ ఫ్యామిలీ వెల్లడించింది. అయితే, ఆయన ఆరోగ్య సమస్య ఏంటో మాత్రం బయటకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు నిన్న సాయంత్రం కువైట్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రకటించింది. ఆయన వయస్సు 86 సంవత్సరాలు.

1937లో జన్మించిన నవాఫ్ అల్ సభా 2020 సెప్టెంబర్‌లో కువైట్ పాలకుడిగా పగ్గాలు చేపట్టి, మూడేళ్లు మాత్రమే అధికారంలో కొనసాగారు. కువైట్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన లక్షలాది మంది కువైట్‌లో జీవనోపాధి పొందుతున్నారు. కువైట్ చమురు సంస్థల్లో, ఇతర కంపెనీల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories