logo

తెలంగాణలో నేడే బిగ్ డే...తీవ్ర ఉత్కంఠ రేపుతున్న...

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్దామని యోచిస్తున్న సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీని రద్దు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీ సంచలన నిర్ణయానికి వేదిక కాబోతోంది.

తెలంగాణలో నేడే బిగ్ డే..తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కేబినెట్ భేటీ...తెలంగాణ అసెంబ్లీ రద్దవుతుందా..? సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్ళడం ఖాయమా అనే సందేహాల నడుమ ఇవాళ మంత్రివర్గ కీలక సమావేశం జరగబోతోంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగడం ఖాయమనే వార్తలు ఉన్నా ఏ సమయానికి భేటీ జరుగుతుందనే స్పష్టత లేదు. అయితే మంత్రులంతా ఉదయం ఆరు గంటల నుంచే అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. దీంతో ఇవాల్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో ఇవాల్టి కేబినెట్‌ భేటీపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. మంత్రిమండలి సమావేశం కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే జరుగుతుందని తెలుస్తోంది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దు నిర్ణయం ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన కేబినెట్ తీర్మాన ప్రతిని గవర్నర్‌కి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారికి అందిస్తారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత కేసీఆర్ గన్ పార్క్ కి దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులరిస్తారు.

ఇవాళ మద్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలంతా ఇవాళ టీఆర్ఎస్ భవన్ కి రావాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. టీఆర్ఎస్ భవన్లో నేతలతో కేసీఆర్ సమావేశమై చర్చించాక మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల అంశాలను కేసీఆర్ అక్కడే అధికారికంగా ప్రకటిస్తారు. శాసన సభ రద్దుతో పాటు కేసీఆర్ ఉద్యోగుల మధ్యంతర భృతిపై ఆర్థికశాఖ అధికారుల నుంచి సీఎం నివేదిక తీసుకున్నారు. ఈ మేరకు మధ్యంతర భృతిపై నేటి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నారు.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top