IPL 2026 : అయ్యర్ విధ్వంసకర సెంచరీ.. లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
IPL 2026 : ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచాడు.
PBKS vs LSG
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ స్టేజ్‌లో జరిగిన 68వ ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టును ఏకపక్షంగా ఓడించింది. ఈ కీలక విజయం ద్వారా పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్లో తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలై నిరాశపరిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 3 వికెట్లు కోల్పోయి, ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఊదేశారు.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో ఇన్నింగ్స్‌లో యువ బ్యాటర్ ఆయుష్ బదోని, జోష్ ఇంగ్లిస్ పంజాబ్ బౌలర్లను ఆడేసుకున్నారు. జోష్ ఇంగ్లిస్ కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, ఆయుష్ బదోని కేవలం 18 బంతుల్లోనే 238 కి పైగా స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ నాటౌట్‌గా 37 రన్స్, రిషబ్ పంత్ 26 రన్స్ చేయడంతో లక్నో భారీ స్కోర్ చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లతో రాణించారు.
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. కేవలం 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ప్రభ్‌సిమ్రాన్ 39 బంతుల్లో 69 పరుగులతో మెరుపులు మెరిపించగా, శ్రేయస్ అయ్యర్ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే అయ్యర్ కేవలం 51 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్లోనే శ్రేయస్ అయ్యర్‌కు ఇది మొదటి సెంచరీ కావడం విశేషం. అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్ పుణ్యమా అని పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది.




