19 ఏళ్ల కళ కలగానే.. పంజాబ్ గెలుపుతో చివరి మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్!
Delhi Capitals Out of IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన ఘన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది.
19 ఏళ్ల కళ కలగానే.. పంజాబ్ గెలుపుతో చివరి మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్!
Delhi Capitals Out of IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన ఘన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడకముందే అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
పంజాబ్ విజయంతో ముగిసిన ఢిల్లీ ఆశలు..
శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఊదేశింది. అయితే ఈ విజయంతో పంజాబ్ ఆనందంలో మునిగిపోతే, ఢిల్లీ క్యాపిటల్స్ గుండె పగిలింది. మే 25న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడటానికి ముందే ఢిల్లీ కథ ముగిసిపోయింది. ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో లక్నో తప్పక గెలవాల్సి ఉంది. కానీ, ఫలితం రివర్స్ కావడంతో ఐపీఎల్ 2026 సీజన్ నుంచి నిష్క్రమించిన నాల్గవ జట్టుగా ఢిల్లీ నిలిచింది.
సమీకరణాలు ఎలా దెబ్బకొట్టాయంటే?
ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఒకవేళ చివరి మ్యాచ్ గెలిచినా ఢిల్లీ గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. కానీ లక్నోపై గెలుపుతో పంజాబ్ కింగ్స్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. దీనితో ఢిల్లీ ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది. ఒకవేళ లక్నో గెలిచి ఉంటే.. ఆదివారం ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలని, ఆ తర్వాత కోల్‌కతాపై ఢిల్లీ భారీ తేడాతో నెగ్గాలని లెక్కలు వేసుకున్నారు. కానీ పంజాబ్ జైత్రయాత్రతో ఆ సమీకరణాలన్నింటికీ బ్రేక్ పడింది.
ఆ ఒక్క పరుగు ఓటమి.. లీగ్ మధ్యలో తడబాటు..!
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్ ఆరంభం నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. లక్నో, ముంబైలపై వరుస విజయాలతో టోర్నీని ఘనంగానే ప్రారంభించినా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసేందుకు నిరాకరించి కొట్టిన షాట్ ఢిల్లీని కేవలం 1 పరుగు తేడాతో ఓడించింది. ఆ ఒక్క పరుగు ఓటమి ఇప్పుడు జట్టు కొంపముంచింది. ఆ తర్వాత బెంగళూరుపై గెలిచి ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో నిలిచినా, టోర్నీ మధ్యలో వరుసగా మూడు ఓటములు జట్టు లయను దెబ్బతీశాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోవడం ఢిల్లీ బలహీనతను ఎత్తిచూపింది. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి రేసులో నిలిచినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వరుసగా ఐదో ఏడాది.. నిరాశ తప్పలేదు..!
ఒక్కసారైనా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ కల మరో ఏడాది ముందుకు జరిగింది. గత ఐదేళ్లుగా ఆ జట్టు ప్లేఆఫ్స్ మెట్లు ఎక్కలేకపోతోంది. చివరిసారిగా 2021లో 20 పాయింట్లతో టేబుల్ టాప్‌లో నిలిచి ప్లేఆఫ్స్ చేరింది. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 19 సీజన్లలో ఢిల్లీ జట్టు కేవలం 6 సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఆ జట్టు పేలవమైన రికార్డుకు అద్దం పడుతోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరగబోయే మ్యాచ్ ఇప్పుడు ఢిల్లీకి కేవలం నామమాత్రపు పోరుగానే మిగిలిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించినా, కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి టోర్నీని గౌరవప్రదంగా ముగించాలని, వచ్చే ఏడాది సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలని అక్షర్ సేన భావిస్తోంది.




